Vikram Kirloskar: భారత్ కు టయోటాను తీసుకొచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త కన్నుమూత

Vikram Kirloskar dies All about Toyota India Vice Chairman who brought Japanese firm to India
  • టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ కన్నుమూత
  • గుండె పోటు రావడంతో విషాదం
  • కర్ణాటక సీఎం, బయోకాన్ చైర్ పర్సన్ సంతాపం
ప్రముఖ పారిశ్రామికవేత్త, టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ అకాల మరణం చెందారు. ఆయన వయసు 64 ఏళ్లు. గుండెపోటు రావడంతో మంగళవారం అర్ధరాత్రి బెంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారకులైన వారిలో విక్రమ్ కిర్లోస్కర్ ఒకరు.

అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసిన విక్రమ్.. జపాన్ కు చెందిన టయోటా మోటార్ కార్ప్ ను భారత్ కు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారు. టయోటా, కిర్లోస్కర్ భాగస్వామ్యంతో ఏర్పడిందే టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ. టయోటా బ్రాండ్ పై కార్లను ఈ జాయింట్ వెంచర్ కంపెనీయే మార్కెట్ చేస్తుంటుంది.

కిర్లోస్కర్ పారిశ్రామిక గ్రూపు నుంచి విక్రమ్ నాలుగో తరం వ్యక్తి. ఈ గ్రూపు 1888లోనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడం గమనార్హం. కిర్లోస్కర్ సిస్టమ్స్ లిమిటెడ్ కు చైర్మన్, ఎండీగానూ విక్రమ్ సేవలు అందిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఆటోమొబైల్ పరిశ్రమ ఏర్పాటు కావడానికి దోహదం చేసిన వారిలో ముఖ్యులు. అందుకే ఆయనకు సువర్ణ కర్ణాటక అవార్డును రాష్ట్ర సర్కారు అందించింది. 

ఇక విక్రమ్ కు భార్య గీతాంజలి,కుమార్తె మానసి ఉన్నారు. బుధవారం హెబ్బెల్ శ్మశాన వాటికలో విక్రమ్ అంత్యక్రియలు జరుగుతాయని కిర్లోస్కర్  గ్రూపు ప్రకటించింది. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు విక్రమ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
Vikram Kirloskar
Toyota kirloskar motor
vice chairman
dies
hear attack
Bengaluru

More Telugu News