Hyderabad: పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదని వరుడి స్నేహితుల గొడవ.. ఆగిన వివాహం!

  • సోమవారం జరగాల్సిన వివాహం
  • ఆదివారం రాత్రి విందు ఇచ్చిన వధువు కుటుంబం
  • భోజనానికి వచ్చి చికెన్ లేదని గొడవ పడి వెళ్లిపోయిన వరుడి స్నేహితులు
  • ఆగిపోయిన పెళ్లి.. పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ
  • కౌన్సెలింగ్‌తో దిగివచ్చిన మగపెళ్లివారు
marriage halted due to not serve chicken in feast

పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదన్న కారణంతో మగ పెళ్లివారు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని షాపూర్‌నగర్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన యువకుడికి, కుత్బుల్లాపూర్‌కు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. షాపూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఉదయం వివాహం జరగాల్సి ఉండగా ఆదివారం రాత్రి ఆడపెళ్లివారు విందు ఏర్పాటు చేశారు. వధువుది బీహార్‌కు చెందిన మార్వాడీ కుటుంబం కావడంతో విందులో అన్నీ శాకాహార వంటలే చేశారు.

విందు ఇక ముగుస్తుందన్న సమయంలో వరుడి తరపు స్నేహితులు భోజనాలకు వచ్చారు. అక్కడున్న శాకాహార వంటలు చూసి చికెన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించి గొడవపడి తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది వధూవరుల కుటుంబాల మధ్య గొడవకు కారణమైంది. చివరికి నిన్న జరగాల్సిన వివాహం ఆగిపోయింది. దీంతో వధువు కుటుంబ సభ్యులు జీడిమెట్ల సీఐని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో రేపు (బుధవారం) వివాహం జరిపించాలని నిర్ణయించారు.

More Telugu News