Chiranjeevi: ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న చిరంజీవి

  • మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక పురస్కారం
  • 53వ ఇఫీ చలనచిత్రోత్సవం సందర్భంగా ప్రకటన
  • నేడు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతులమీదుగా అవార్డు
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి
Chiranjeevi receives Indian Film Personality Of The Year award

గోవాలో జరుగుతున్న 53వ ఇఫీ చలనచిత్రోత్సవం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించడం తెలిసిందే. ఇవాళ ఇఫీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు చివరి రోజు కాగా, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతులమీదుగా చిరంజీవి విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. 

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నానని తన మనోభావాన్ని వెల్లడించారు. తాను మెగాస్టార్ స్థాయికి చేరానంటే లైట్ బాయ్ నుంచి సినీ రంగంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని వినమ్రంగా తెలిపారు. ఈ అవార్డుకు కారణమైన ప్రతి ఒక్కరికీ నిండు మనసుతో శిరసు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. 

అభిమానుల ప్రేమ తనను మెగాస్టార్ ను చేసిందని, ఇవాళ ఇక్కడి వరకు నడిపించిందని, వారి ప్రేమకు తాను దాసుడ్ని అని చెప్పారు. వారి పట్ల జీవితాంతం కృతజ్ఞతతో ఉంటానని అన్నారు. రాజకీయాల నుంచి మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత తనకు సినిమా పరిశ్రమ విలువ తెలిసిందని చిరంజీవి వెల్లడించారు.

ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చిందని తెలిపారు. అవినీతి లేని ఏకైక రంగం సినీ రంగం అని అన్నారు. చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉంటేనే ఎదుగుతామని స్పష్టం చేశారు. ప్రతిభ ఉండి ఉపయోగించుకోగలిగితే ఆకాశమే హద్దుగా ఎదగవచ్చని, తాను ఆ విధంగానే ఎదిగానని వివరించారు. తనకు యువ హీరోలు పోటీ అని భావించడంలేదని, తానే వాళ్లకు పోటీ అని పేర్కొన్నారు.

More Telugu News