Rajwinder Singh: ఓ యువతి హత్య కేసులో ఆస్ట్రేలియా ప్రభుత్వం వెదుకుతున్న వ్యక్తి ఢిల్లీలో పట్టివేత

Delhi police caught murder accused fled from Australia
  • 2018లో క్వీన్స్ లాండ్ లో టోయా అనే యువతి హత్య
  • రజ్వీందర్ సింగ్ అనే భారతీయుడిపై హత్యారోపణలు
  • భారత్ కు పారిపోయి వచ్చిన సింగ్
  • అతడిని తమకు అప్పగించాలన్న ఆస్ట్రేలియా
  • నేడు ఢిల్లీలో అరెస్ట్
ఆస్ట్రేలియాలో హత్యారోపణలు ఎదుర్కొంటూ భారత్ కు పారిపోయి వచ్చిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరు రజ్వీందర్ సింగ్. వయసు 38 సంవత్సరాలు. ఆస్ట్రేలియాలోని ఇన్నిస్ ఫాయిల్ లో నర్సుగా పనిచేసేవాడు. అతడి స్వస్థలం పంజాబ్ లోని బట్టర్ కలాన్. 

2018లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ లో టోయా కార్డింగ్లే అనే 24 ఏళ్ల యువతి బీచ్ వద్ద హత్యకు గురైంది. టోయా ఓ ఫార్మసీలో పనిచేసేది. క్వీన్స్ లాండ్ లోని వాగెట్టి బీచ్ లో తన పెంపుడు కుక్కతో కలిసి షికారుకు వెళ్లిన ఆమె విగతజీవురాలిగా కనిపించింది. 

రజ్వీందర్ సింగ్ ఈ హత్యచేసి ఉంటాడని పోలీసులు భావించారు. ఈ హత్య జరిగిన రెండ్రోజుల తర్వాత రజ్వీందర్ సింగ్ తన భార్యాబిడ్డలను ఆస్ట్రేలియాలోనే వదిలిపెట్టి భారత్ కు పారిపోయి వచ్చాడు. దాంతో ఆస్ట్రేలియా పోలీసుల అనుమానాలకు మరింత బలం చేకూరింది. 

ఈ నేపథ్యంలో, రజ్వీందర్ సింగ్ ఆచూకీ తెలిపిన వారికి ఆస్ట్రేలియా ప్రభుత్వం రూ.5.50 కోట్ల నజరానా ప్రకటించింది. రజ్వీందర్ సింగ్ భారత్ చేరుకున్నట్టు గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం అతడు పట్టుబడితే తమకు అప్పగించాలని 2021 మార్చిలో భారత కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ విజ్ఞప్తికి భారత్ ఈ నవంబరు నెలలో ఆమోదం తెలిపింది. రజ్వీందర్ సింగ్ కోసం కేంద్రం ముమ్మర వేట సాగించింది. ఈ క్రమంలో  నేడు ఢిల్లీ పోలీసులు రజ్వీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని త్వరలోనే ఆస్ట్రేలియాకు అప్పగిస్తారని తెలుస్తోంది.  

కాగా, టోయా ఎందుకు హత్యకు గురైందన్నది ఇప్పటివరకు మిస్టరీగానే ఉండిపోయింది. ఇప్పుడు రజ్వీందర్ అరెస్టయిన నేపథ్యంలో ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
Rajwinder Singh
Toya
Queensland
Murder
Australia
Punjab
India

More Telugu News