BJP: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తీపి కబురు

Nitin Gadkari approves projects worth Rs 573 crore for Telangana and Andhra Pradesh
  • ఏపీ, తెలంగాణలో రహదారుల అభివృద్ధి పనులకు  రూ. 573 కోట్లు విడుదల చేసిన గడ్కరీ 
  • కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జీకి రూ.436.91 కోట్ల మంజూరు
  • హైదరాబాద్‌ - భూపాలపట్నం జాతీయ రహదారి విస్తరణకు రూ. 136.22 కోట్ల విడుదల  
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలకు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తీపి కబురు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు రూ.573.13 కోట్లు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌-భూపాలపట్నం సెక్షన్‌లో 163వ జాతీయ రహదారి విస్తరణ, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు, ఎన్‌హెచ్‌-167కేలో 2ఉ4 లేన్ల అభివృద్ధి పనులు ఉన్నాయి. వీటిలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణా నదిపై రూ.436.91 కోట్లతో ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించనున్నారు. 

ఈ రహదారి వల్ల హైదరాబాద్‌ నుంచి తిరుపతి, నంద్యాల, చెన్నైల మధ్య దాదాపు 80 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఈ ఐకానిక్‌ బ్రిడ్జి ఇరు రాష్ట్రాలకు గేట్ వేగా నిలుస్తుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇక, రూ.136.22 కోట్ల వ్యయంతో జాతీయ రహదారి 163 (హైదరాబాద్‌-భూపాలపట్నం)పై ములుగులో ప్రస్తుతమున్న రెండు లైన్ల రోడ్డు విస్తరణకు కూడా ఆమోదం తెలిపారు. లక్నవరం సరస్సు, బొగత జలపాతం వంటి ప్రముఖ పర్యాటక స్థలాలకు మరింత ప్రాచుర్యం లభించనుంది. అలాగే, ఈ రోడ్డు విస్తరణవల్ల తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయని గడ్కరీ తెలిపారు.
BJP
Telangana
Andhra Pradesh
Nitin Gadkari

More Telugu News