Vikram Gokhale: బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే మృతి చెందినట్టు వార్తలు.. బతికే ఉన్నారన్న కుటుంబ సభ్యులు

  • గోఖలే కన్నుమూశారంటూ అజయ్ దేవగణ్ సహా పలువురి ట్వీట్
  • ఆయనింకా బతికే ఉన్నారన్న కుటుంబ సభ్యులు
  • ఆయన కోసం ప్రార్థించాలని కోరిన గోఖలే కుమార్తె
 Vikram Gokhales family refutes death news

బాలీవుడ్ సీనియర్ నటుడు, మరాఠీ స్టేజ్, సినిమా, టీవీ నటుడు విక్రమ్ గోఖలే (77) మరణించినట్టు ఈ తెల్లవారుజాము నుంచీ వార్తలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటులు అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్‌ముఖ్, అలీ గోనీ, జావెద్ జాఫరీ తదితరులు ట్విట్టర్ ద్వారా సంతాపం కూడా తెలిపారు. అయితే, గోఖలే చనిపోయినట్టు వస్తున్న వార్తలపై ఆయన కుటుంబ సభ్యులు స్పందిస్తూ, గోఖలే బతికే ఉన్నారని, కాకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారని, ఆయన కోసం ప్రార్థించాలంటూ గోఖలే కుమార్తె కోరారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోఖలే పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారన్న విషయాన్ని అటు కుటుంబ సభ్యులు కానీ, ఇటు ఆసుపత్రి వర్గాలు కానీ వెల్లడించలేదు. ప్రముఖ మరాఠీ థియేటర్, సినిమా ఆర్టిస్ట్ చంద్రకాంత్ గోఖలే కుమారుడైన విక్రమ్ గోఖలే.. సంజయ్ లీలా బన్సాలీ రొమాంటిక్ మూవీ ‘హమ్ దిల్‌దే చుకే సనమ్ (1999), కమల హాసన్ సినిమా ‘హే రామ్’, ‘భూల్ భులైయా’ (2007), ‘దే దనాదన్ (2009) వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

2010లో డైరెక్టర్‌గా మారి ‘ఆఘాత్’ సినిమాను తెరకెక్కించారు. మరాఠీ సినిమా ‘అనుమతి’లో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు. థియేటర్ నటనకు గాను 2011లో ‘సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు’ను అందుకున్నారు. అలాగే, ‘మిషన్ మంగళ్’, ‘హిచ్‌కీ’, ‘అయారీ’, ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘అగ్నిపథ్’ వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. శిల్పాశెట్టి, అభిమన్యు దాసాని నటించిన ‘నికామా’ సినిమాలో విక్రమ్ గోఖలే చివరిసారి కనిపించారు. ఈ ఏడాది జూన్‌లో ఈ సినిమా విడుదలైంది.

More Telugu News