Andhra Pradesh: ఏపీ కాంగ్రెస్‌కు కొత్త చీఫ్.. గిడుగు రుద్రరాజును అధ్యక్షుడిగా నియమించిన అధిష్ఠానం

Gidugu Rudraraju appointed as APCC Chief
  • శైలజానాథ్‌ను తప్పించి రుద్రరాజుకు బాధ్యతలు
  • 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ నియామకం
  • 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీని నియమించిన అధిష్ఠానం
  • హర్షకుమార్, తులసిరెడ్డిలకు పదవులు
ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి కోల్పోయి అష్టకష్టాలు పడుతున్న కాంగ్రెస్‌కు కొత్త చీఫ్ వచ్చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను తప్పించి ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించారు. అలాగే, 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీతోపాటు 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీని అధిష్ఠానం నియమించింది. సీనియర్ నేత హర్షకుమార్‌కు కూడా పదవి లభించింది.

మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి.రాజేశ్‌లను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించిన అధిష్ఠానం.. హర్షకుమార్‌ను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. మరో సీనియర్ నేత తులసిరెడ్డి మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రుద్రరాజుకు సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరుంది. 

కాంగ్రెస్‌తో చిన్నప్పటి నుంచే అనుబంధం ఉన్న ఆయన పార్టీకి అత్యంత విధేయుడు కూడా. తనను ఏపీసీసీ చీఫ్‌గా నియమించడంపై రుద్రరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో  పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. అందరినీ కలుపుకుని ముందుకెళ్తానని పేర్కొన్నారు. 


Andhra Pradesh
Congress
APCC
Gidugu Rudraraju
Sake Sailajanath

More Telugu News