Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై సోదాలు.. రూ. 6 కోట్ల నగదు దొరికిందన్న ఐటీ శాఖ

IT Officials seized about Rs 6 Crore over raids on minister malla reddy
  • కొన్ని చోట్ల ముగిసిన తనిఖీలు.. మరికొన్ని చోట్ల కొనసాగుతున్న వైనం
  • మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఐటీ వర్గాలు
  • ఐటీ సోదాలతో తనకు, తన కుమారుడికి ఇబ్బంది లేదన్న మంత్రి
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఆదాయపన్నుశాఖ తెలిపింది. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతోపాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన దాదాపు 400 మంది అధికారులు 65 బృందాలుగా విడిపోయి ఈ సోదాల్లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. మరికొన్ని చోట్ల ఈ రాత్రికి ముగియనుండగా, ఇంకొన్ని చోట్ల రేపు కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఈ సందర్భంగా ఐటీ అధికారులు  మాట్లాడుతూ.. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసినట్టు గుర్తించినట్టు చెప్పారు. లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించడంతోపాటు మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం వెచ్చిస్తున్నట్టు ఆధారాలు సేకరించామన్నారు. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువకు తక్కువగా చూపించారని అన్నారు. మంత్రి వియ్యంకుడు వర్ధమాన్ కళాశాలలో డైరెక్టర్‌గా ఉండడంతో అక్కడ కూడా సోదాలు చేసినట్టు తెలిపారు.

మరోపక్క, తన ఆస్తులపై జరుగుతున్న ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. అన్ని అనుమతులతోనే ఆసుపత్రులు, కళాశాలలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వాటి ఆస్తుల వివరాలను అధికారులకు అందజేశామని, వారికి సహకరిస్తున్నామని అన్నారు. ఐటీ దాడుల వల్ల తనకు గానీ, తన కుమారులకు గానీ ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. రేపు (గురువారం) ఉదయానికల్లా సోదాలు ముగిసే అవకాశం ఉందన్నారు.
Minister Mallareddy
Telangana
IT Raids
Mallareddy Colleges

More Telugu News