Meghalaya: అసోం- మేఘాలయ మధ్య మళ్లీ ఉద్రిక్తత.. సరిహద్దు కాల్పుల్లో ఆరుగురి మృతి

  • కలప స్మగ్లింగ్‌‌ను అడ్డుకునేందుకు అసోం అటవీ అధికారుల కాల్పులు
  • అసోం ఫారెస్ట్ గార్డు సహా ఐదుగురు మేఘాలయ వాసుల మృతి
  • దర్యాప్తునకు ఆదేశించిన మేఘాలయ ముఖ్యమంత్రి
  • ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్
6 Killed In Assam and Meghalaya Border Firing

అసోం-మేఘాలయ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ ఫారెస్ట్ గార్డు సహా ఆరుగురు మృతి చెందారు. మేఘాలయ వెస్ట్ జైంటియా హిల్స్‌లోని ముక్రో గ్రామంలో జరిగిందీ ఘటన. చనిపోయిన వారిలో ఐదుగురు మేఘాలయకు చెందిన వారు కాగా, ఒకరు అసోం ఫారెస్ట్ గార్డ్. నిన్న ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కలపను స్మగ్లింగ్ చేస్తున్న ట్రక్కును అసోం అటవీ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో స్మగ్లర్లు వాహనాన్ని ఆపకపోగా మరింత వేగంగా పోనిచ్చారు. ఛేజ్ చేసిన ఫారెస్ట్ గార్డులు కాల్పులు జరపడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఘటనలో మేఘాలయకు చెందిన ఐదుగురితోపాటు అసోం ఫారెస్ట్ గార్డు కూడా మృతి చెందినట్టు మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ధ్రువీకరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. మరోవైపు, ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కాగా, అసోం-మేఘాలయ మధ్య 884.9 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇందులో 12 వివాదాస్పద ప్రాంతాలున్నాయి. 

వీటిలో ఆరింటికి సంబంధించి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా మధ్య గత మార్చిలో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంతో 70 శాతం సమస్య పరిష్కారమైందని అప్పట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మిగిలిన ఆరు ప్రాంతాలపైనా చర్చలు జరుగుతాయని చెప్పారు. అంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పొరుగు రాష్ట్రాల మధ్య మరోమారు ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.

More Telugu News