Thopudurthi Prakash Reddy: 'జాకీ' ఎందుకు వెళ్లిపోయిందో లోకేశ్, పరిటాల సునీతలే చెప్పాలి: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Thopudurthi Prakash Reddy slams TDP leaders over Jockey industry
  • తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న 'జాకీ'
  • ఏపీ నుంచి వెళ్లిపోవడంపై రాజకీయ దుమారం
  • వైసీపీ ప్రభుత్వమే కారణమంటున్న టీడీపీ
  • మీ హయాంలో ఎందుకు ఏర్పాటు కాలేదంటున్న వైసీపీ
వైసీపీ నేతల వల్లనే 'జాకీ' పరిశ్రమ ఏపీ నుంచి తరలి వెళ్లిందని ఓ పత్రికలో వచ్చిన కథనంపైనా, టీడీపీ నేతలు విమర్శిస్తుండడంపైనా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి స్పందించారు. నాడు టీడీపీ ప్రభుత్వ కమీషన్ల బేరం వల్లనే జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందని ఆరోపించారు. అప్పుడు నారా లోకేశ్ పరిశ్రమల మంత్రిగా ఉన్నారని, జిల్లాకు చెందిన పరిటాల సునీత కూడా మంత్రివర్గంలోనే ఉన్నారని, జాకీ పరిశ్రమ ఎందుకు వెళ్లిపోయిందో వాళ్లిద్దరినే అడగాలని తోపుదుర్తి స్పష్టం చేశారు. 

"జాకీ పరిశ్రమ నిమిత్తం పేజ్ అనే సంస్థకు నాటి ప్రభుత్వం 2017లో భూములు కేటాయించింది. ఆ మరుసటి ఏడాది సేల్ డీడ్ ఇచ్చింది. అయినప్పటికీ పరిశ్రమ ఏర్పాటు కాలేదు. అప్పుడున్నది టీడీపీ ప్రభుత్వమే కదా... పరిశ్రమ రాకుండా అడ్డుకున్నది ఎవరో చెప్పాలి. రూ.140 కోట్ల విలువైన భూములను రూ.240 కోట్లకు ఆ సంస్థకు ఎలా రాసిచ్చారు?" అంటూ వైసీపీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. 

'జాకీ' పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించాలని ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం కోరుతూనే ఉందని స్పష్టం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు తగిన సహకారం అందిస్తామని, భూములు ఇస్తామని చెబుతున్నా 'జాకీ' వర్గాలే ముందుకు రావడంలేదని అన్నారు.
Thopudurthi Prakash Reddy
Jockey
Nara Lokesh
Paritala Sunitha
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News