Pawan Kalyan: అన్నయ్యకు ఈ అవార్డు దక్కడం పట్ల ఎంతో ఆనందిస్తున్నాను: పవన్ కల్యాణ్

Pawan Kalyan opines on Chiranjeevi as Indian Film Personality Of The Year
  • చిరంజీవికి కేంద్ర ప్రభుత్వ అవార్డు
  • చిరును వరించిన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్
  • ప్రకటన చేసిన కేంద్రమంతి అనురాగ్ ఠాకూర్
  • ఎంతో సంతోషంగా ఉందన్న పవన్ కల్యాణ్
తెలుగు చిత్రసీమ మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డుకు ఎంపిక చేయడం తెలిసిందే. దీనిపై చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ స్పందించారు. 

ఈ ఆనంద సమయంలో  తన మార్గదర్శి, అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. తెలుగు చిత్రసీమలో శిఖర సమానులైన అన్నయ్య చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తికిరీటంలో చేరిన మరొక వజ్రం అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. 

"నాలుగు దశాబ్దాలకు పైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలుచుకుని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలనచిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Pawan Kalyan
Chiranjeevi
Award
Tollywood

More Telugu News