Donald Trump: ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించిన మస్క్.. తాను తిరిగి రానంటున్న ట్రంప్

  • ట్రంప్ ఖాతాను పునరుద్ధరించే విషయంపై పోల్ నిర్వహించిన మస్క్
  • 51 శాతం మంది ట్రంప్ కు  అనుకూలంగా ఓటు
  • పునరుద్ధరించినా తాను ట్విట్టర్ వాడనని చెప్పిన ట్రంప్
Donald Trump Twitter account restored after Musks voice of the people poll

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్టు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ లో ట్రంప్ తిరిగి రావడానికి సంబంధించి మస్క్ పోలింగ్ నిర్వహించగా.. ఈ పోల్‌లో ఎక్కువ మంది అనుకూలంగా ఓటు వేశాడు. దాంతో, ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. ప్రజల స్వరం పేరిట 'అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌ ను తిరిగి తీసుకు రావాలా?' అంటూ నిర్వహించిన పోల్లో పాల్గొన్న వారిలో 51.8 శాతం మంది మద్దతు ఇచ్చారని తెలిపారు. పోలింగ్ ఫలితాలను ట్వీట్లో షేర్ చేశారు. అదే సమయంలో 'ప్రజల స్వరం, దేవుని స్వరం' అని అర్థం వచ్చే లాటిన్ పదాన్ని జోడించారు. దాంతో, డొనాల్డ్ ట్రంప్ ఖాతా మరోసారి ట్విట్టర్‌లో కనిపించడం ప్రారంభించింది.

2020 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గతేడాది జనవరిలో అమెరికాలో తీవ్రస్థాయిలో హింసాకాండ చెలరేగింది. ముఖ్యంగా క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. వారిని రెచ్చగొట్టే విధంగా ట్రంప్ వ్యవహరించారని వార్తలు రావడంతో ట్రంప్ ఖాతాలను తొలగిస్తున్నట్టు  ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రకటించాయి. అయితే, మస్క్ ట్విట్టర్ పగ్గాలు అందుకున్న వెంటనే ట్రంప్ సహా పలువురు ప్రముఖుల ఖాతాలను పునరుద్ధరించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. 

అయితే, తనను నిషేధించిన ట్విట్టర్‌లోకి తిరిగి రావడానికి ఆసక్తి లేదని డొనాల్డ్ ట్రంప్ శనివారం చెప్పారు. ట్విట్టర్ లో తిరిగి రావడానికి తనకు ఎలాంటి కారణం కనిపించడం లేదని అన్నారు. తన సొంత మీడియా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) స్టార్టప్ అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌తో తాను కట్టుబడి ఉంటానని, ఇది ట్విట్టర్ కంటే మెరుగైన యూజర్ ఎంగేజ్‌మెంట్‌ను కలిగి ఉందని, అద్భుతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

More Telugu News