Gaganyaan: ‘గగన్‌యాన్’లో కీలక ఘట్టం.. వ్యోమగాములను భూమికి తీసుకొచ్చే పారాచూట్‌లను పరీక్షించిన ఇస్రో

  • అంతరిక్షం నుంచి వ్యోమగాములను భూమిపైకి చేర్చనున్న పారాచూట్‌లు
  • క్రూ మాడ్యూల్‌కు సమానమైన 5 టన్నుల డమ్మీ బరువుతో ప్రయోగం
  • 2.5 కిలోమీటర్ల పైనుంచి క్రూ మాడ్యూల్‌ను జారవిడిచిన ఎయిర్‌ఫోర్స్ విమానం
Gaganyaan Isro tests parachutes that will bring astronauts to Earth from space

వచ్చే ఏడాది ‘గగన్‌యాన్’ ప్రయోగానికి సిద్ధమవుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ముఖ్య ఘట్టాన్ని పూర్తి చేసింది. భారత వ్యోమగాములను అంతరిక్షం నుంచి భూమికి తీసుకొచ్చే పారాచూట్‌లను పరీక్షించింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్‌సీ) ఈ పరీక్షను నిర్వహించింది. ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని బాబినా ఫీల్డ్ ఫైర్ రేంజ్ (బీఎఫ్ఎఫ్ఆర్) వద్ద దాని క్రూ మాడ్యూల్ డీసెలరేషన్ సిస్టంకు చెందిన ఇంటెగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ) నిర్వహించింది.

ఈ ప్రయోగంలో భాగంగా క్రూ మాడ్యూల్ బరువుకు సమానమైన 5 టన్నుల డమ్మీ బరువును భారత వైమానికి దళానికి చెందిన ఐఎల్-76 విమానం ద్వారా 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి జారవిడిచారు. ఆ తర్వాత మాడ్యూల్ సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయింది. గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ కోసం పారాచూట్ సిస్టం మొత్తం 10 పారాచూట్‌లను కలిగి ఉంటుందని ఇస్రో తెలిపింది. వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు మూడు ప్రధాన పారాచూట్‌లలో రెండు సరిపోతాయని, మూడోది అదనమని పేర్కొంది. అయితే, ప్రతి పారాచూట్ పనితీరును సంక్లిష్టమైన పనితీరు ద్వారా అంచనా వేయాల్సి ఉంటుందని తెలిపింది. 

ఇక, నిన్నటి ప్రయోగం రెండుమూడు నిమిషాలపాటు కొనసాగింది. పేలోడ్ బరువు నేలపై మృదువుగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ సమయంలో మెయిన్ పారాచూట్‌లు పేలోడ్ వేగాన్ని సురక్షితమైన వేగానికి తగ్గించినట్టు పరీక్షలో తేలింది. ఈ పరీక్షతో గగన్‌యాన్ ప్రాజెక్ట్ ఓ ముఖ్యమైన మైలురాయిని చేరుకుందని ఇస్రో పేర్కొంది.

More Telugu News