Marri Shashidhar Reddy: పార్టీ మార్పుపై మరింత స్పష్టత నిచ్చిన మర్రి శశిధర్ రెడ్డి

Marri Shashidhra Reddy clarifies on party change
  • పార్టీ మారుతున్నట్టు శశిధర్ రెడ్డిపై కథనాలు
  • బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలు
  • ఢిల్లీలో అమిత్ షాను కలిసిన శశిధర్ రెడ్డి
  • తనతో పాటు మరికొందరు కాంగ్రెస్ ను వీడుతున్నారన్న సీనియర్ నేత
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మర్రి శశిధర్ రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీ మారుతున్నాడంటూ కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మర్రి శశిధర్ రెడ్డి స్వయంగా స్పష్టతనిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ తో బాధపడుతోందని, ఇప్పట్లో ఆ క్యాన్సర్ నయమయ్యే సూచనలు కనిపించడంలేదని అన్నారు. అందుకే ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడాల్సి వస్తోందని వెల్లడించారు. తనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బయటికి వస్తున్నట్టు తెలిపారు. 

ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదని, మునుగోడు ఉప ఎన్నికను ఎంతో తేలిగ్గా తీసుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా అందుకు రేవంత్ దే బాధ్యత అని శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ను చెంచాగాళ్లతో నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. 

మర్రి శశిధర్ రెడ్డి... బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ లతో కలిసి నిన్న ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. శశిధర్ రెడ్డి పార్టీలోకి వచ్చేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Marri Shashidhar Reddy
Congress
BJP
Telangana

More Telugu News