Gaza: శరణార్థుల శిబిరంలో పుట్టిన రోజు వేడుకలు.. అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి

Neighbours mourn deaths of 21 family members in Gaza home fire
  • ఓ అపార్ట్‌మెంట్‌లో చిన్నారి పుట్టిన రోజు వేడుక
  • ప్రమాదంలో మొత్తం 21 మంది మృత్యువాత
  • ఒకే కుటుంబంలోని మూడు తరాల వారు బలి
  • మృతుల్లో ఏడుగురు చిన్నారులు
గాజాలోని శరణార్థుల శిబిరంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా జరుగుతున్న ఓ పుట్టిన రోజు వేడుక చివరికి విషాదంగా ముగిసింది. అగ్ని ప్రమాదం ఓ కుటుంబం మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు అంటుకుని 21 మంది సజీవ దహనం కాగా, వారిలో 17 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండడం హృదయాలను పిండేస్తోంది. వీరిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో గురువారం రాత్రి జరిగిందీ ఘటన. మూడు అంతస్తులున్న ఓ భవనంలోని పై అంతస్తులో  అబు రయా అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది.

ఆయన కుటుంబంలోని ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకతోపాటు, ఈజిప్టు నుంచి ఓ వ్యక్తి రావడంతో ఆనందంతో అందరూ కలిసి వేడుక జరుపుకున్నారు. ఈ క్రమంలో సంభవించిన అగ్ని ప్రమాదం వారిని పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఇంట్లో నిల్వచేసిన పెట్రోలుకు మంటలు అంటుకోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నా.. దానికి మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై స్పష్టత లేదు. ప్రమాదం గురించి చెప్పేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరు కూడా మిగలకపోవడం విషాదం.

అయితే, పెట్రోలే ప్రమాదానికి కారణమన్న వార్తలను అబూ రయా బంధువు మహ్మద్ అబూరయా కొట్టిపడేశారు. వారి ఇంట్లో ఫర్నిచర్ అధికంగా ఉందని, మంటలు పెద్ద ఎత్తున చెలరేగడానికి అది కూడా కారణమై ఉంటుందని అన్నారు. బాధిత కుటుంబంలో మూడు తరాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. గాజా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇళ్లలో పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ను నిల్వచేసుకోవడం ఇక్కడి ప్రజలకు పరిపాటిగా మారింది. ఇప్పుడదే వారి ప్రాణాలు తీస్తోంది.
Gaza
Israel
Jabalia Refugee Camp
Palastine

More Telugu News