FIFA World Cup: ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్... బీర్ల అమ్మకాలపై నిషేధం

Qatar bans beers at stadium premises during FIFA World Cup
  • ఎల్లుండి నుంచి ఫిఫా వరల్డ్ కప్
  • స్టేడియంల పరిసరాల్లో బీర్ల అమ్మకాలపై నిషేధం
  • నాన్ ఆల్కహాలిక్ బీర్లకు ఓకే
  • ఖతార్ నిర్ణయానికి ఫిఫా సమ్మతి 
నాలుగేళ్లకోసారి ప్రపంచ ఫుట్ బాల్ ప్రేమికులను అలరించే ఫిఫా వరల్డ్ కప్ ఈసారి ఆసియా దేశం ఖతార్ లో జరగనుంది. నెలరోజుల పాటు సాకర్ ప్రియులను ఉర్రూతలూగించనున్న ఈ వరల్డ్ కప్ నవంబరు 20న ప్రారంభం కానుంది. డిసెంబరు 18న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

అయితే, ఈ మెగా ఈవెంట్ కు ఆతిథ్యమిస్తున్న ఖతార్ ముస్లిం దేశం కావడంతో సహజంగానే ఇక్కడ అనేక ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా స్టేడియంల వద్ద కూడా ఆంక్షలు విధించారు. వరల్డ్ కప్ మ్యాచ్ లు జరిగే స్టేడియంల పరిసరాల్లో బీర్లు అమ్మరాదని ఖతార్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. నాన్ ఆల్కహాలిక్ బీర్లపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయానికి ఫిఫా కూడా మద్దతు పలికింది. 

ఖతార్లోని 8 స్టేడియంలలో వరల్డ్ కప్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ సాకర్ సంరంభాన్ని వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి 10 లక్షల మంది అభిమానులు ఖతార్ వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, పాశ్చాత్యదేశాలకు చెందినవారికి ఖతార్ ప్రభుత్వ నిర్ణయం నిరాశ కలిగించే విషయంగా భావించాలి. ఎందుకంటే, యూరప్ లో క్లబ్ స్థాయి మ్యాచ్ నుంచి అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ వరకు మైదానంలో అభిమానుల చేతుల్లో బీరు గ్లాసులు ఉండాల్సిందే. 

ఖతార్ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం స్టేడియంలలో కేవలం వీఐపీ సూట్లలో మాత్రమే బీర్లు అందుబాటులో ఉండనున్నాయి. వీటిని ఫిఫానే విక్రయించనుంది. అయితే, ఖతార్ లో అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్ జోన్ లలో బీర్లు లభ్యమవుతాయని తెలుస్తోంది.
FIFA World Cup
Qatar
Beer
Ban
Stadium

More Telugu News