Hemanth: రాష్ట్ర ముఖ్యమంత్రిని.. నేను పారిపోతాననుకున్నారా?: హేమంత్ సోరెన్

  • ఈడీ సమన్లపై జార్ఖండ్ సీఎం ఆగ్రహం
  • బడా వ్యాపారవేత్తలే కానీ రాజకీయ నేతలు పారిపోరని వ్యాఖ్య
  • జార్ఖండ్ పై కేంద్రంలోని బీజేపీ భారీ కుట్ర పన్నిందని ఆరోపణ
harkhand Hemant Soren Says Mining Probe Part Of Larger Conspiracy

‘రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా.. ముఖ్యమంత్రి పారిపోతాడనుకుంటున్నారా.. సమన్లు పంపడం ఇలాగేనా?’ అంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విచారణ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు జార్ఖండ్ లో అమలు చేస్తున్న కుట్ర ఫలితంగానే తనపై అక్రమ కేసులు నమోదయ్యాయని హేమంత్ ఆరోపించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తనను విదేశాలకు పారిపోయే వ్యక్తిలా ఈడీ అధికారులు ట్రీట్ చేస్తున్నారని మండిపడ్డారు. తనకు తెలిసినంతలో బ్యాంకులను వేల కోట్లకు ముంచిన బడా వ్యాపారవేత్తలే దేశం విడిచి పారిపోయారని, ఒక్క రాజకీయ నాయకుడు కూడా అలా పారిపోయిన దాఖలాలు లేవని హేమంత్ సోరెన్ చెప్పారు. రాంచీలో ఈరోజు మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మనీలాండరింగ్ కేసులో తనకు సమన్లు పంపడాన్ని తప్పుబట్టిన హేమంత్.. తనపై అనర్హత వేటు పడేలా ఉందని చెప్పారు. రాష్ట్రంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ ల ఉమ్మడి ప్రభుత్వాన్ని కూల్చడమే బీజేపీ పెద్దల లక్ష్యమని ఆరోపించారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తొందరగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు సోరెన్ విజ్ఞప్తి చేశారు. తన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలకు చెప్పారు.

జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ ఆడుతున్న నాటకంలో తనపై కేసు నమోదు, ఈడీ అధికారుల సమన్లు వంటివి ఒక చిన్న భాగం మాత్రమేనని హేమంత్ సోరెన్ తెలిపారు. ఈ కేసులో నిర్ణయం తీసుకోవడంపై గవర్నర్ రమేష్ బయాస్ నాన్చివేత ధోరణిని అవలంభించడంపై హేమంత్ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటామని గవర్నర్ చెప్పారని... అయితే, గవర్నర్ కార్యాలయం నుంచి అలాంటి ప్రతిపాదనలేమీ అందలేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసినట్లు హేమంత్ సోరెన్ తెలిపారు.

More Telugu News