VLC: వీఎల్ సీ మీడియా ప్లేయర్ పై భారత్ లో నిషేధం ఎత్తివేత

  • హ్యాకింగ్ కు అవకాశముందంటూ గతంలో నిషేధం
  • లీగల్ నోటీసులు పంపిన వీడియో లాన్
  • తమ హక్కులను కాలరాస్తున్నారని విమర్శలు
Center lifts ban on VLC Media Player

స్పష్టమైన శబ్ద నాణ్యతతో ఆన్ లైన్ లో సంగీతాన్ని ఆస్వాదించేందుకు అత్యధికులు వీఎల్ సీ మీడియా ప్లేయర్ ను వినియోగిస్తారు. అయితే ఈ మీడియా ప్లేయర్ లో చైనా హ్యాకింగ్ గ్రూపు 'సికాడా' ప్రమాదకర వైరస్ లు, మాల్వేర్లను చొప్పించి హ్యాకింగ్ కు పాల్పడే అవకాశముందన్న కారణంతో వీఎల్ సీని కేంద్రం గత ఫిబ్రవరిలో నిషేధించింది. 

తాజాగా కేంద్రం ఈ నిషేధాన్ని తొలగించింది. వీఎల్ సీ మాతృసంస్థ వీడియో లాన్ కేంద్రానికి నోటీసులు ఇచ్చిన నెల రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇకపై దేశంలో సంగీత ప్రేమికులు ఈ మీడియా ప్లేయర్ సేవలను పొందవచ్చు. 

వీఎల్ సీని నిషేధించడంపై వీడియో లాన్ కేంద్ర టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్ మెంట్ (డీఓటీ), కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఇటీవల లీగల్ నోటీసులు జారీ చేసింది. తమ మీడియా ప్లేయర్ ను బ్లాక్ చేయడమంటే భారత రాజ్యాంగ హక్కులను, అంతర్జాతీయ చట్టాన్ని అతిక్రమించడమేనని వీడియో లాన్ పేర్కొంది. 

ఈ నేపథ్యంలో, వీఎల్ సీపై కేంద్రం నిషేధం ఎత్తివేసిన విషయాన్ని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ నిర్ధారించింది.

More Telugu News