Cambodia: జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం

Cambodian PM Hun Sen tests Covid positive at G20 after meeting world leaders at Asean
  • కంబోడియా ప్రధాని హున్ సేన్ కు కరోనా నిర్ధారణ
  • తన సమావేశాలను రద్దు చేసుకొని కంబోడియా తిరుగు పయనం
  • మొన్న ముగిసిన ఆసియాన్ సదస్సులో బైడెన్, భారత ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌కడ్ ను కలిసిన హున్ సేన్
ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం సృష్టించింది. ఈ సదస్సుకు వచ్చిన కంబోడియా ప్రధాన మంత్రి హున్ సేన్ కోవిడ్ బారిన పడ్డారు. దాంతో, సదస్సులో తన సమావేశాలన్నింటినీ ఆయన రద్దు చేసుకున్నారు. ఇటీవలే కంబోడియాలోని ఫ్నోమ్‌లో జరిగిన అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియాన్) సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌కడ్ సహా ప్రపంచ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. 

ఆదివారం ముగిసిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి కంబోడియా ఆతిథ్యం ఇచ్చింది. సేన్ చాలా మంది నాయకులతో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. అనంతరం సోమవారం రాత్రి బాలి చేరుకున్నారు. ఆ రాత్రి ఆయనకు కరోనా పరీక్షలు చేశారు. ఇందులో ఆయన పాజిటివ్ గా తేలారు. ఈ విషయాన్ని ఇండోనేషియా వైద్యులు ధ్రువీకరించారు. దాంతో, తాను కంబోడియాకు తిరిగి వస్తున్నానని, జీ 20తో పాటు బ్యాంకాక్‌లో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఫోరమ్‌లో తన సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్లు హున్ సేన్ తెలిపారు. 

తాను సోమవారం ఆలస్యంగా బాలి చేరుకోవడం అదృష్టమని అన్నారు. ముందే వచ్చి ఉంటే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇతర నేతలతో కలిసి విందులో పాల్గొనేవాడినని చెప్పారు. తనకు కరోనా ఎలా సోకిందో తెలియదన్నారు. కాగా, బాలిలో మంగళ, బుధవారాల్లో జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 20 దేశాల నేతలు ఇందులో పాల్గొంటున్నారు.
Cambodia
Prime Minister
tests
COVID19
positive
g20
bali

More Telugu News