AAP: టికెట్ ఇవ్వలేదని టెలిఫోన్ టవర్ ఎక్కి.. ఆపై ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన ‘ఆప్’ నేత

  • ఎంసీడీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన పార్టీ
  • టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
  • తన ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదంటూ అతిషి, దుర్గేష్ పాఠక్‌లపై ఆరోపణలు
AAP Leader Denied MCD Ticket Climbs Tower and Goes Live

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత ఒకరు టెలిఫోన్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశారు. ఆపై అక్కడి నుంచే ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి సొంత పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈస్ట్ ఢిల్లీ మాజీ కౌన్సిలర్ అయిన హసీబుల్ హసన్‌కు ఈసారి పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన టెలిఫోన్ టవర్ ఎక్కి చనిపోతానని బెదిరించారు. ఆప్ నేతలు అతిషి, దుర్గేష్ పాఠక్‌‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. వారు తన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వడం లేదన్నారు.

ఫేస్‌బుక్ లైవ్‌లో కెమెరాను భూమిపైకి, తనవైపునకు తిప్పి చూపిస్తూ తానెంత ఎత్తులో ఉన్నదీ చెప్పుకొచ్చారు. తనకేమైనా అయినా, ఆత్మహత్య చేసుకున్నా అందుకు ఆ ఇద్దరు నేతలే కారకులవుతారని హెచ్చరించారు. అతిషి, దుర్గేష్‌ల వద్ద తన బ్యాంకు పాస్‌బుక్ సహా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు రేపే చివరి రోజని, అయినా వారు తన డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంసీడీ ఎన్నికల్లో పార్టీ తనను బరిలోకి దింపుతుందా? లేదా? అన్న ఆందోళన తనకు లేదని, తన డాక్యుమెంట్లు తనకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు. 

హసన్ వార్తల్లోకి ఎక్కడం ఇదే తొలిసారి కాదు. మార్చిలో ఓ మురికి కాలువలోకి దిగి శుభ్రం చేశారు. తెల్లని కుర్తా ధరించిన ఆయన మురికి కాలువలో గుండెల లోతు వరకు దిగి చెత్తను బయటకు తీసిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. కాగా, హసన్ చేసిన ఆరోపణలపై పార్టీ ఇప్పటి వరకు స్పందించలేదు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

More Telugu News