AAP: ఆప్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా జన సంద్రంగా మారిన సూరత్

huge crowd gathered in surat to greet aap candidate gopal italia
  • గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
  • సూరత్ నుంచి ఆప్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గోపాల్ ఇటాాలియా
  • ఈ కార్యక్రమానికి హాజరైన ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా
  • ర్యాలీతో సూరత్ రోడ్లన్నీ నిండిపోయిన వైనం
మన దేశంలో ఎన్నికలంటే ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఎన్నికలు ముగిసే దాకా సందడే సందడి. నామినేషన్ దాఖలు నుంచి కౌంటింగ్ దాకా నేతల చుట్టూ జన సందోహం కనిపిస్తూనే ఉంటుంది. డబ్బు, మద్యం ఏరులై పారుతాయి. ఈ తరహా రాజకీయాలను సమూలంగా మార్చేస్తామంటూ బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లోనూ ఇదే తరహా వైఖరి కనిపిస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సూరత్ లో ఆప్ అభ్యర్థి నామినేషన్ కు వచ్చిన జనాన్ని చూస్తే ఈ మాట నిజమేనని ఒప్పుకోక తప్పదు. ఆప్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా సూరత్ జన సంద్రాన్ని తలపించింది. ఇసుకేస్తే రాలనంత మంది ఆ అభ్యర్థి నామినేషన్ కు హాజరయ్యారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామంటూ ఆప్ ఇదివరకే ప్రకటించింది. అంతేకాకుండా ఎన్నికల్లో తన సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించిన ఆప్...ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ సాగుతోంది. ఈ క్రమంలో తొలి విడత ఎన్నికల్లో భాగంగా నామినేషన్లు కూడా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సూరత్ నుంచి ఆప్ అభ్యర్థిగా ఖరారు అయిన గోపాల్ ఇటాలియా శనివారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆప్ నిర్వహించిన ర్యాలీకి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఈ జనంతో సూరత్ రోడ్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఈ కార్యక్రమానికి ఆప్ లో జనాకర్షక నేతగా పేరున్న రాజ్యసభ సభ్యుడు, యువ రాజకీయవేత్త రాఘవ్ చద్ధా హాజరయ్యారు. రాఘవ్ చద్ధా హాజరైన కారణంగానే ఈ ర్యాలీకి సూరత్ ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ జన సందోహాన్ని చూసిన ఆప్... గుజరాత్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ ఒక్క ఫొటో చాలంటూ వ్యాఖ్యానించింది.
AAP
Gujarat
Surat
Gopal Italia
Raghava Chaddha

More Telugu News