YSRCP: నగరిలో హైటెన్షన్... రోజా పర్యటనకు ముందు వైసీపీ జడ్పీటీసీ అరెస్ట్

  • పత్తిపుత్తూరులో నూతనంగా గ్రామ సచివాలయ భవనం నిర్మాణం
  • రోజా ప్రారంభించడానికి ముందే తాళం వేసిన వైసీపీ జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి
  • తాళం పగులగొట్టిన రోజా వర్గీయులు
  • మురళీధర్ రెడ్డి సహా ఆయన సోదరుడు రవి రెడ్డి అరెస్ట్
ysrcp zptc arrested in ap minister roja constituency nagari

ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు తన సొంత నియోజకవర్గం నగరిలో మరోమారు నిరసన సెగ తగిలింది. ఆ నిరసన సెగ కూడా తన సొంత పార్టీకి చెందిన నేతల నుంచే కావడం గమనార్హం. నగరి పరిధిలోని వడమాలపేట మండలం పత్తిపుత్తూరులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించేందుకు రోజా వెళుతున్న సమయంలో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరిలో రోజాకు వ్యతిరేకంగా వైసీపీలో ఓ వర్గం తమ పరిధిలోని గ్రామాల్లోకి రోజాను రానివ్వకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వడమాలపేట మండల జడ్పీటీసీగా కొనసాగుతున్న మురళీధర్ రెడ్డి... రోజాకు వ్యతిరేక వర్గంలో ఉన్నారు. రోజా తన మండలానికి వస్తున్నారన్న సమచారం అందుకున్న ఆయన తన సోదరుడు రవి రెడ్డితో కలిసి పత్తిపుత్తూరు వెళ్లారు. అక్కడ రోజా చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న గ్రామ సచివాలయ భవనానికి ఆయన తాళం వేశారు. ఈ భవనాన్ని తానే నిర్మించానని, అయితే అందుకు సంబంధించిన బిల్లులు ఇంకా విడుదల కాలేదని...బిల్లులు ఇప్పించిన తర్వాతే తాళం తీస్తానని ఆయన భీష్మించారు.

అయితే అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న రోజా వర్గీయులు మురళీధర్ రెడ్డి వర్గీయులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, పరస్పర దాడులు చోటుచేసుకున్నాయి. అనంతరం రోజా వర్గీయులు గ్రామ సచివాలయ భవనానికి వేసిన తాళాన్ని పగులగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా... రంగ ప్రవేశం చేసిన పోలీసులు మురళీధర్ రెడ్డితో పాటు రవి రెడ్డిని అరెస్ట్ చేసి వడమాలపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత గ్రామానికి చేరుకున్న మంత్రి రోజా గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.

More Telugu News