Chandrababu: పుంగనూరు, గుంతకల్లులలో జరిగిన రెండు ఘటనలు రాష్ట్రంలో వైసీపీ రాక్షస రాజకీయానికి నిదర్శనం: చంద్రబాబు

Chandrababu take dig at YCP
  • పుంగనూరులో అద్దె భవనంలో టీడీపీ ఆఫీసు
  • కూల్చివేతకు సిద్ధమైన అధికారులు
  • గుంతకల్లులో కుట్టు శిక్షణ కేంద్రానికి నిప్పు
  • తీవ్రస్థాయిలో స్పందించిన చంద్రబాబు
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ కార్యాలయానికి అద్దెకు ఇచ్చిన ఓ భవనం అక్రమ నిర్మాణం అంటూ అధికారులు కూల్చివేతకు సిద్ధమవడం, అనంతపురం జిల్లా గుంతకల్లులో మహిళల కుట్టుశిక్షణ కేంద్రానికి నిప్పు పెట్టడం వంటి ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. 

పుంగనూరు, గుంతకల్లులో జరిగిన రెండు ఘటనలు రాష్ట్రంలో వైసీపీ రాక్షస రాజకీయానికి నిదర్శనం అని పేర్కొన్నారు. పుంగనూరులో టీడీపీ కార్యాలయం ఉన్న భవనాన్ని ఖాళీ చేయించడానికి స్వయంగా ఎస్పీ బలగాలతో వెళతారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఐపీఎస్ కు అర్హులేనా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. 

అటు, గుంతకల్లులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని రాజకీయ కక్షతో తగలబెడతారా? ఇదేనా మీ రాజకీయం? అంటూ మండిపడ్డారు. తగలబెట్టడం, కూలగొట్టడం వంటి తమ సంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైసీపీ ఇంకా బయటికి రాలేదా? అని చంద్రబాబు విమర్శించారు. ఈ రెండు ఘటనల తాలూకు పత్రికా క్లిప్పింగ్స్ ను కూడా చంద్రబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Chandrababu
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News