USA: బైడెన్ సోదరులు సహా.. 200 మంది అమెరికన్లపై రష్యా నిషేధం

Russia Bans Entry To 200 US Citizens Including Joe Biden Siblings
  • రష్యాలోకి అడుగుపెట్టకుండా పుతిన్ ఆదేశాలు
  • ఇప్పటికే వెయ్యిమందికి పైగా అమెరికన్ల రాకపై బ్యాన్
  • హాలీవుడ్ నటులపైనా నిషేధాజ్ఞలే విధించిన పుతిన్
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చూపుతూ రష్యాపై అమెరికా పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే! దీనిపై మండిపడుతున్న రష్యా ప్రెసిడెంట్ తాజాగా కౌంటర్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రెసిడెంట్ తోబుట్టువులతో పాటు మొత్తం 200 మంది అమెరికన్లను రష్యాలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించారు. 

ఇందులో వైట్ హౌస్ ఉన్నతాధికారులు, పలువురు సెనేట్ సభ్యులు, వారి దగ్గరి బంధువులు, పలు కంపెనీల యజమానులు ఉన్నారని రష్యా విదేశాంగ శాఖ వివరించింది. యుద్ధాన్ని బూచిగా చూపిస్తూ ప్రపంచ దేశాలలో రష్యాపై విముఖత పెరిగేలా, ఉక్రెయిన్ పై సానుభూతి చూపించేలా చేసిన పలు రంగాల నిపుణులపైనా బ్యాన్ విధించినట్లు స్పష్టంచేసింది.

బైడెన్ సోదరి వాలెరి, తమ్ముడు జేమ్స్, ఫ్రాన్సిస్ లతో పాటు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కెరైన్ జీన్, సెనేటర్లు బెర్నీ శాండర్స్, ఎలిజబెత్ వారెన్ లు రష్యాలోకి ప్రవేశించకుండా పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. హాలీవుడ్ యాక్టర్, అమెరికా పౌరుడు అయిన బెన్ స్టిల్లర్, సియాన్ పెన్ లపైనా రష్యా గతంలోనే నిషేధం విధించింది. ఇప్పటికే దాదాపు వెయ్యికి పైగా అమెరికన్లను తమ దేశంలోకి అడుగుపెట్టకుండా రష్యా నిషేధాజ్ఞలు విధించింది.
USA
Russia
putin
biden
entry ban
americans

More Telugu News