Jagan: సార్... మీతో మాకున్న అనుబంధం చాలా బలమైనది: మోదీ సభలో జగన్

Jagan praises PM Modi in Vizag sabha
  • దేశ ప్రగతి రథసారథి, ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నామన్న జగన్
  • ఏపీకి పెద్ద మనసుతో ఎంతో చేస్తున్నారని కొనియాడిన సీఎం
  • పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై సానుకూలంగా స్పందించాలని విన్నపం
దేశ ప్రగతి రథసారథి, గౌరవనీయులు, పెద్దలు, ప్రధాని నరేంద్ర మోదీ గారికి విశాఖకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చారిత్రక ఆంధ్ర యూనివర్శిటీలో ఈరోజు ఒకవైపు సముద్రం, మరోవైపు జన సముద్రం కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ సభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా తరలివచ్చారని అన్నారు. రాష్ట్రంలో రూ. 10,742 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. విశాఖలోని ఏయూ గ్రౌండ్ లో ప్రధాని మోదీ సభలో జగన్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

'సార్, ఈ మూడేళ్లలో ప్రజలకు అనుకూలంగా ఎన్నో చేశాం. మహిళలకు సాధికారత, విద్య, వైద్యం, గ్రామ సచివాలయాలు వంటి కార్యక్రమాల్లో ఎంతో అభివృద్ధిని సాధించాం. గడప వద్దకే పాలన ప్రాధాన్యతగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏపీకి మీరు పెద్ద మనసుతో ఎంతో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా మీతో మాకు ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనది. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా రైల్వే జోన్ వంటి వాటిపై మేము పలుమార్లు చేసిన విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నా. రాష్ట్రానికి మీరు చేసే ప్రతి సాయం, ఇచ్చే ప్రతి సంస్థ, ప్రతి రూపాయి మా అభివృద్ధికి దోహదపడతాయి. పెద్దలైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి" అన్నారు ముఖ్యమంత్రి జగన్.
Jagan
YSRCP
Narendra Modi
BJP
Vizag

More Telugu News