Nose: ముంజేతిపై ముక్కును మొలిపించి.. ముఖానికి అతికించిన వైద్యులు!

Surgeons In France Successfully Transplant Nose Grown On Womans Arm To Her Face
  • ముక్కు క్యాన్సర్ బాధితురాలికి కొత్త జీవితం
  • క్యాన్సర్ చికిత్సలో ముక్కులో కొంతభాగం కోల్పోయిన మహిళ
  • త్రీడీ టెక్నాలజీతో అవయవమార్పిడి చేసిన ఫ్రాన్స్ వైద్యులు
క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ మహిళకు ఫ్రాన్స్ వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. చికిత్సలో కోల్పోయిన ముక్కును కృత్రిమంగా తయారుచేసి శస్త్రచికిత్సతో అతికించారు. త్రీడీ టెక్నాలజీ సాయంతో ఈ అద్భుతం సాధ్యమైందని వైద్యులు చెప్పారు. ఫ్రాన్స్ లోని టౌలౌజ్ నగరానికి చెందిన ఓ మహిళ చాలాకాలంగా ముక్కు క్యాన్సర్ తో బాధపడుతోంది. చికిత్సలో భాగంగా రేడియో థెరపీ, కీమోథెరపీ వల్ల ఆమె ముక్కులో కొంతభాగం దెబ్బతింది. దాంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో పాటు ముఖం వికారంగా తయారయ్యింది. 2013 నుంచి ఆమె అలాగే అవస్థపడుతూ జీవిస్తోంది.

తాజాగా టౌలౌజ్ యూనివర్సిటీ హాస్పిటల్ (సీహెచ్ యూ) వైద్యులు ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. బెల్జియం కంపెనీ సాయంతో కృత్రిమ ముక్కును తయారు చేశారు. ముక్కులోని మృదులాస్థి స్థానంలో బయోమెటీరియల్ ను త్రీడీలో ప్రింట్ చేసి బాధితురాలి ముంజేతిపై అతికించారు. మొక్కకు అంటుకట్టిన విధంగా ముక్కును ముంజేతిపై అతికించి, రెండు నెలల పాటు ఎదగనిచ్చారు. పూర్తిస్థాయిలో ముక్కు తయారుకాగానే శస్త్రచికిత్స చేసి బాధితురాలి ముఖానికి అతికించారు. మైక్రో సర్జరీ ద్వారా రక్తనాళాలను అతికించినట్లు వివరించారు.

యాంటిబయాటిక్ మందులు వాడుతూ పదిరోజుల పాటు ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉంచినట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటోందని చెప్పారు. కొత్తగా అతికించిన ముక్కు శరీరంలో కలిసిపోయిందని, రక్తప్రసరణ కూడా సాఫీగా జరుగుతోందని వివరించారు. ఇంకొన్ని రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి, ఏ ఇబ్బందులు లేకుంటే బాధితురాలిని డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారు.
Nose
3d print
France surgeons
transplant

More Telugu News