Pawan Kalyan: బీజేపీ నేతల కంటే ముందే ప్రధాని మోదీని కలిసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan met PM Modi in Vizag
  • విశాఖకు ఆలస్యంగా చేరుకున్న ప్రధాని మోదీ
  • షెడ్యూల్ ప్రకారం ప్రధానిని కలవాల్సి ఉన్న బీజేపీ నేతలు
  • మోదీ ఆలస్యంగా రావడంతో పవన్ కు అవకాశం
  • వివిధ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన పవన్
  • పవన్ వెంట సమావేశానికి హాజరైన నాదెండ్ల
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత వీరిరువురు సమావేశమయ్యారు. 

వాస్తవానికి ప్రధానిని మొదట బీజేపీ కోర్ కమిటీ సభ్యులు కలవాల్సి ఉంది. ఆ తర్వాతే పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే ప్రధాని పర్యటన గంటన్నర ఆలస్యం కావడంతో, మోదీని మొదట పవన్ కల్యాణ్ కలిశారు. 

ఈ కీలక సమావేశానికి పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఈ భేటీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. 

ఎనిమిదేళ్ల తర్వాత ప్రధానిని కలవడం ఇదే ప్రథమం అని వెల్లడించారు. ఇది ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన సమావేశం అని తెలిపారు. ప్రధాని మోదీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని, తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండాలని అభిలషించారని పవన్ వివరించారు. తనకు అవగాహన ఉన్న మేరకు ప్రధాని అడిగిన విషయాలు తెలియజేశానని చెప్పారు. 

ఏపీకి భవిష్యత్తులో మంచి రోజులు తెచ్చే దిశగా ఈ భేటీ ఫలప్రదం అయిందని భావిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాగా విశాఖలో ఇటీవల జరిగిన పరిణామాలపై ప్రధానితో మాట్లాడారా? అన్న ప్రశ్నకు పవన్ సమాధానం దాటవేశారు. ఇవన్నీ త్వరలో తెలియజేస్తానని మీడియా సమావేశాన్ని ముగించుకుని నిష్క్రమించారు.
Pawan Kalyan
Narendra Modi
Visakhapatnam
Janasena
BJP
Andhra Pradesh

More Telugu News