Shiv Sena: జైలు నుంచి వచ్చాక స్వరం మార్చిన సంజయ్ రౌత్.. ఫడ్నవీస్ పై ప్రశంసలు

Out on bail Shiv Senas Sanjay Raut says will meet PM Modi meet Amit Shah in Delhi
  • డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ మంచి నిర్ణయాలు తీసుకున్నారన్న రౌత్  
  • ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాను కలుస్తానని ప్రకటన
  • రాజకీయాల్లో ప్రతీకారం ఏమీ ఉండదని వ్యాఖ్య
మనీలాండరింగ్ కేసులో 100 రోజుల జైలు జీవితం తర్వాత, శివసేన ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్, ఎంపీ సంజయ్ రౌత్ స్వరంలో మార్పు వచ్చింది. వీలు చిక్కినప్పుడల్లా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను, బీజేపీ నేతలను ఆయన విమర్శిస్తుంటారు. కానీ, ప్రస్తుతానికి ఆయన విమర్శలను పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. బుధవారం జైలు నుంచి విడుదలైన తర్వాత గురువారం ముంబైలోని బంధూప్ లో తన నివాసం బయట మీడియాతో రౌత్ మాట్లాడారు. 

‘‘ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ ను ఈ రోజు కలుస్తాను. ప్రజలకు సంబంధించి పనుల కోసం రెండు నుంచి నాలుగు రోజుల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను సైతం కలుస్తా. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ సమావేశం అవుతాను’ అని చెప్పారు.  

ఇక అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే మరో అంశం.. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూల్చి ఏర్పాటైన ప్రస్తుత సర్కారును రౌత్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందంటూ, వ్యతిరేకించాలన్న దృష్టితో వ్యతిరేకంగా మాట్లడబోనన్నారు. ఎవరి విషయంలోనూ తనకు ఫిర్యాదులు లేవని రౌత్ స్పష్టం చేశారు. రాజకీయ ప్రతీకారాన్ని తాను చూడలేదన్నారు. 

డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాలను స్వాగతిస్తున్నానంటూ, రాష్ట్రాన్ని డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ నడిపిస్తున్నారని తాము భావిస్తున్నట్టు చెప్పారు. బీజేపీని తాను వ్యతిరేకిస్తుంటానని రౌత్ స్పష్టం చేశారు. తన చర్యలు, మాటల మధ్య వైరుద్ధ్యంపై మీడియా ప్రశ్నించగా.. ‘‘నేను ఎంపీని. నా సోదరుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాయకులను కలుసుకునే హక్కు నాకుంది. హోం మంత్రి అంటే దేశం మొత్తానికి, ఒక పార్టీకి కాదు’’ అని రౌత్ పేర్కొన్నారు.
Shiv Sena
Sanjay Raut
meet PM Modi
meet Amit Shah

More Telugu News