BJP: గుజరాత్ ఎన్నికల బరిలోకి దిగుతున్న స్టార్​ క్రికెటర్ భార్య.. టికెట్ ఖరారు చేసిన బీజేపీ!

Gujarat Assembly polls Jadeja wife rivaba gets BJP ticket
  • గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 160 మంది అభ్యర్థులతో
     తొలి జాబితా విడుదల
  • బరిలో జడేజా భార్య రివాబా, పటీదార్ నేత హార్దిక్ పటేల్
  • డిసెంబర్ 1,5వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్
డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 160 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గురువారం ప్రకటించింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, భూపేందర్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 

  భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు టికెట్ లభించింది. ఆమె జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. గెలిస్తే ఆమె ఎమ్మెల్యే కాబోతున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ విరామ్‌గాం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి మజురా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) సమావేశాన్ని బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పార్టీకి చెందిన మరో ముగ్గురు నాయకులు కొత్త ముఖాలకు మార్గం కల్పించడానికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు. రూపానీ ఆగస్టు 2016 నుంచి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం, ఆయన రాజ్‌కోట్ వెస్ట్ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు.

కాగా, గుజరాత్‌ అసెంబ్లీకి రెండు దఫాల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 1న 89 నియోజకవర్గాల్లో, డిసెంబర్ 5న మిగిలిన 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. బీజేపీ వరుసగా ఆరోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ కు తోడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్ లో పాగా వేయాలని చూస్తోంది.
BJP
Team India
Ravindra Jadeja
Gujarat
elections
jadeja wife
ticket

More Telugu News