Gautam Navlakha: అవినీతి సొమ్ముతో కేసుల నుంచి బయటపడుతున్నారు: సుప్రీంకోర్టు ఆవేదన

Supreme Court counters government in Gautam Navlakha case
  • ఎల్గార్ పరిషద్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గౌతమ్ నవ్‌లఖా
  • తనను గృహ నిర్బంధంలో ఉంచాలని నవ్‌లఖా పిటిషన్
  • నవ్‌లఖా దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారన్న అదనపు సొలిసిటర్ జనరల్
  • దేశాన్ని నాశనం చేస్తున్నది అవినీతిపరులేనన్న ధర్మాసనం
  • నవ్‌లఖాను కొంతకాలంపాటు గృహ నిర్బంధంలో ఉంచి చూద్దామన్న సుప్రీంకోర్టు
ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అవినీతిపరులు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని, అవినీతి సొమ్ముతో కేసుల నుంచి బయటపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులను కొనేందుకు కోట్ల రూపాయలు సిద్ధంగా ఉంచుకున్నామని కొందరు చెబుతున్న వీడియోను తాము చూశామని ధర్మాసనం పేర్కొంది. వీరు దేశానికి వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదని ఎలా అనగలమని ప్రశ్నించింది. ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవిస్తున్న గౌతమ్ నవ్‌లఖా (70) సుప్రీంను ఆశ్రయించారు. తన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జుడీషియల్ కస్టడీలో కాకుండా గృహ నిర్బంధంలో ఉంచాలని సుప్రీంను అభ్యర్థించారు. 

ముంబైలో తనను ఉంచిన తలోజా జైలులో కనీస సౌకర్యాలు, వైద్య సదుపాయాలు లేవని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై నిన్న వాదనలు జరిగాయి. నవ్‌లఖా తరపు న్యాయవాది వాదనలను జాతీయ దర్యాప్తు  సంస్థ (ఎన్ఐఏ) తరపు న్యాయవాది, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వ్యతిరేకించారు. నవ్‌లఖా దేశాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. దేశాన్ని నాశనం చేస్తున్నదెవరో నిజంగా తెలుసుకోవాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. దేశాన్ని నాశనం చేస్తున్నది అవినీతిపరులేనని, వారిపై ఎవరు చర్యలు తీసుకుంటున్నారని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేష్‌రాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. 

ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు సిద్ధం చేసుకున్నట్టు కొందరు మాట్లాడిన వీడియోను తాము చూశామని తెలిపింది. ఎంత పెద్ద అవినీతికి పాల్పడినా ధనబలంతో చాలా సులభంగా తప్పించుకుంటున్నారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన అదనపు సొలిసిటర్ జనరల్.. తాను అవినీతిపరులను సమర్థించడం లేదని స్పష్టం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని చెప్పారు. 

మరోవైపు, నవ్‌లఖా పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం.. నవ్‌లఖాను కొంతకాలం పాటు గృహ నిర్బంధంలో ఉంచి చూద్దామని, ఆయన ఏదైనా తప్పుచేస్తే అప్పుడు మళ్లీ జైలుకు పంపొచ్చని ధర్మాసనం పేర్కొంది.
Gautam Navlakha
Elgar Parishad Case
Supreme Court
NIA

More Telugu News