Madhya Pradesh: ఆ రోడ్డు నాణ్యత లోపానికి క్షమించండి... జబల్ పూర్ ప్రజలతో కేంద్ర మంత్రి గడ్కరీ

nitin gadkari says sorry to habalpur public over road construction
  • మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో బహిరంగ సభకు హాజరైన గడ్కరీ
  • కరేలా నుంచి ముండ్లా వరకు రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించిందని వెల్లడి
  • ఆ రోడ్డును మళ్లీ నిర్మించినట్లు ప్రకటన 
  • కలిగిన ఇబ్బందికి క్షమించాలని జబల్ పూర్ వాసులను కోరిన కేంద్ర మంత్రి
మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం అయిన రోడ్డు నాణ్యత లోపించిందని ఒప్పుకున్న గడ్కరీ... అందుకు తనను క్షమించాలంటూ ప్రజలను కోరారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జరిగిన బహిరంగ సభా వేదికగా గడ్కరీ చేసిన ప్రకటనకు అక్కడి ప్రజలు కరతాళ ధ్వనులతో ప్రశంసలు తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలోనే గడ్కరీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. 

మధ్యప్రదేశ్ లోని ముండ్లా నుంచి జబల్ పూర్ వరకు కేంద్రం కొత్తగా రోడ్డును నిర్మిస్తోంది. ఇందులో భాగంగా బరేలా నుంచి ముండ్లా వరకు వేసిన 63 కిలో మీటర్ల రోడ్డును గతంలోనే గడ్కరీ పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆయన గుర్తించారు. ఆ రోడ్డును పునర్నిర్మించేలా ఆదేశాలు జారీ చేశారు. తాజాగా బుధవారం జబల్ పూర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. 

''నాకు చాలా బాధగా ఉంది. తప్పు జరిగినప్పుడు క్షమాపణ కోరడానికి నేను వెనుకాడబోను. బరేలా నుంచి ముండ్లా వరకు వేసిన రోడ్డు నిర్మాణంలో నాకు సంతృప్తి లేదు. అక్కడ సమస్య ఉందని తెలుసు. నేను అధికారులతో మాట్లాడాను. పెండింగ్ లో ఉన్న పని గురించి కాంట్రాక్టరుతో మాట్లాడి.. ఓ పరస్పర అంగీకారానికి రావాలని కోరాను. కొత్తగా టెండర్లు పిలిచి మళ్లీ రోడ్డు వేయాలని ఆదేశించాను. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులకు క్షమాపణలు కోరుతున్నా'' అని గడ్కరీ చెప్పారు.
Madhya Pradesh
Jabalpur
BJP
Nitin Gadkari

More Telugu News