Andhra Pradesh: మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ

supreme court dismisses ap government petition seeking cancel the bail of tdp leader p narayana
  • అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారంటూ నారాయణపై సీఐడీ కేసు
  • నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
  • మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములను చేయొద్దంటూ సుప్రీం ఘాటు వ్యాఖ్య
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నారాయణ ముందస్తు బెయిల్ ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో నిర్మించతలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను మంత్రి హోదాలో నారాయణ ఉద్దేశపూర్వకంగా మార్చారని, తన వారికి మేలు చేసేందుకే ఆయన ఈ పని చేశారంటూ ఏపీ సీఐడీ ఓ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీఐడీ అధికారులు చర్యలు మొదలుపెట్టకముందే నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వైద్య చికిత్సల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి ఉందని, ఈ క్రమంలో అమరావతి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును కోరగా... కోర్టు అందుకు సానుకూలంగా స్పందించి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

అయితే నారాయణకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఏపీ వాదనను తిరస్కరించిన సుప్రీంకోర్టు... నారాయణకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయడానికి అంగీకరించలేదు. ఈ సందర్భంగా ప్రతి చిన్న విషయానికి సుప్రీంకోర్టు తలుపు తడితే ఎలా? అంటూ ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములను చేయొద్దని కూడా ఏపీ సర్కారుపై కోర్టు కీలక వ్యాఖ్యులు చేసింది.
Andhra Pradesh
YSRCP
Amaravati
Naveen Patnaik
AP High Court
Supreme Court
TDP

More Telugu News