T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో బిగ్ సండే... రేపు ఒకే రోజు 3 మ్యాచ్ లు

  • ఇప్పటికే గ్రూప్ 1 నుంచి సెమీస్ చేరిన న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు
  • రేపటి 3 మ్యాచ్ లతో గ్రూప్ 2 సెమీస్ బెర్తులు ఖరారు కానున్న వైనం
  • దక్షిణాఫ్రికా ఓడి పాక్ గెలిస్తేనే దాయాది దేశానికి సెమీస్ అవకాశం
  • దక్షిణాఫ్రికా, పాక్ గెలిచి... భారత్ ఓడితే.. సెకండ్ బెర్త్ పై ఉత్కంఠ నెలకొనే అవకాశం
In t20 world cup tomorrow is a big sunday

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో రేపు (ఆదివారం) ఒకే రోజు ఏకంగా 3 మ్యాచ్ లు జరగనున్నాయి. ఫలితంగా రేపటి ఆదివారాన్ని క్రికెట్ లవర్స్ బిగ్ సండేగా పిలుస్తున్నారు. ఈ 3 మ్యాచ్ లు కూడా గ్రూప్ 2కు చెందినవే కావడం గమనార్హం. ఇప్పటికే గ్రూప్ 1 నుంచి సెమీస్ కు న్యూజిలాండ్ తో పాటు ఇంగ్లండ్ లు అర్హత సాధించాయి. ఆదివారం జరగనున్న లీగ్ మ్యాచ్ ల ఫలితాలు.. సెమీస్ లో గ్రూప్ 1 లోని జట్లతో తలపడే జట్లను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రేపటి మ్యాచ్ లు గ్రూప్ 2 సెమీస్ బెర్త్ లను ఖరారు చేసే కీలక మ్యాచ్ లుగా పరిణమించనున్నాయి. 

భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 5.30 గంటలకు నెదర్లాండ్స్ జట్టుతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఆ తర్వాత ఉదయం 9.30 గంటలకు బంగ్లాదేశ్ తో పాకిస్థాన్ జట్టు తలపడుతుంది. చివరిగా మధ్యాహ్నం 1.30 గంటలకు జింబాబ్వేతో టీమిండియా మ్యాచ్ జరగనుంది. గ్రూప్ 2లో మొత్తం 6 జట్లు ఉండగా... అన్ని జట్లు ఇప్పటిదాకా నాలుగేసి మ్యాచ్ లు ఆడాయి. 4 మ్యాచ్ లలో 3 విజయాలు నమోదు చేసిన టీమిండియా మొత్తం 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. రేపటి మ్యాచ్ లో జింబాబ్వేపై గెలిస్తే... టీమిండియా నేరుగా సెమీ ఫైనల్ చేరుతుంది. అంతేకాకుండా సెమీస్ లో గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ తో ఫైనల్ బెర్తు కోసం పోరాడనుంది. 

ఇక గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా రేపటి మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిస్తే... 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. అంతేకాకుండా సెమీస్ బెర్తును ఆ జట్టు ఖరారు చేసుకోనుంది. ఈ మ్యాచ్ జయాపజయాలపై పాకిస్థాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దక్షిణాఫ్రికా రేపటి మ్యాచ్ లో ఓడితేనే పాక్ కు సెమీస్ అవకాశాలుంటాయి. దక్షిణాఫ్రికా ఓడినా... బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో పాక్ గెలిస్తేనే దాయాదీ దేశానికి సెమీస్ అవకాశాలుంటాయి. ఎందుకంటే పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్న పాక్ ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. రేపటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓడితే ఆ జట్టు ఖాతాలో ఉన్న 5 పాయింట్లలో మార్పు రాకపోగా... పాక్ గెలిస్తే ఆ జట్టు పాయింట్లు 6కు చేరతాయి. ఈ లెక్కన పాక్ సెమీస్ చేరాలంటే... రేపటి మ్యాచ్ లలో పెద్ద అద్భుతాలే జరగాల్సి ఉంటుంది. 

ఒకవేళ... రేపటి 3 మ్యాచ్ లలో ప్రధాన జట్లు భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్లు విజయాలు నమోదు చేస్తే.. భారత్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ చేరతాయి. పాకిస్థాన్ ఇంటి బాట పట్టక తప్పదు. అలా కాకుండా రేపటి మ్యాచ్ లలో దక్షిణాఫ్రికా, పాక్ విజయాలు నమోదు చేసి... జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో భారత్ ఓడితే మాత్రం... దక్షిణాఫ్రికా నేరుగా సెమీస్ చేరుకోనుండగా... రెండో బెర్తు కోసం భారత్, పాక్ ల మధ్య ఆసక్తికర పోరు సాగనుంది. రెండు జట్ల పాయింట్లు సమంగా ఉన్న నేపథ్యంలో నెట్ రన్ రేటు ఆధారంగా బెర్తులు నిర్ణయిస్తారు కాబట్టి... రన్ రేటులో భారత్ కంటే మెరుగైన గణాంకాలు ఉన్న పాక్ సెమీస్ చేరుతుంది.

More Telugu News