cable bridge: రంగులేసి, పాలిష్ చేసి మమ అనిపించేశారు.. మోర్బీ బ్రిడ్జి ప్రమాదంలో కీలక విషయం వెలుగులోకి !

Renovation firm only painted Morbi footbridge and polished cables
  • మరమ్మతులలో కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యం
  • తీగలకు రంగులేసి వదిలేశారు
  • బ్రిడ్జి సామర్థ్యాన్ని శాస్త్రీయంగా పరీక్షించలేదు
  • శిథిలాలను పరీక్షించి ప్రాథమికంగా తేల్చిన దర్యాప్తు అధికారులు
  • మరింత లోతుగా విచారణ జరుపనున్నట్లు వెల్లడి
గుజరాత్ లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి కీలక విషయాన్ని విచారణ అధికారులు బయటపెట్టారు. బ్రిడ్జి మరమ్మతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. నిర్మాణాన్ని శాస్త్రీయంగా పరీక్షించాల్సి ఉండగా కాంట్రాక్టర్ అలాంటిదేమీ నిర్వహించలేదని వెల్లడించారు. తీగలకు రంగులేసి, మార్బుల్స్ ను పాలిష్ చేసి మరమ్మతులు పూర్తయినట్లు చూపించారన్నారు. ఈమేరకు విచారణ కమిటీలోని పోలీసు అధికారి ఒకరు ఈ వివరాలను వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని, బ్రిడ్జి శిథిలాలను పరిశీలించి ఈ విషయాలను గమనించినట్లు తెలిపారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

దాదాపు 143 ఏళ్లనాటి బ్రిడ్జి కావడంతో మరమ్మతుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందని దర్యాప్తు అధికారి అభిప్రాయపడ్డారు. వంతెన పునర్నిర్మాణ పనులకు డిసెంబర్ దాకా గడువు ఉన్నప్పటికీ ఏడు నెలలలోపే హడావుడిగా పనులు ఎందుకు పూర్తిచేయాల్సి వచ్చిందనేది విచారిస్తామన్నారు. సామర్థ్యానికి మించి జనాలను బ్రిడ్జిపైకి అనుమతించడమే ప్రమాదానికి కారణమైందా? అనేది కూడా పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఈ మరమ్మతులు చేపట్టేందుకు ఒరెవా గ్రూపు నుంచి కాంట్రాక్టు పొందిన సంస్థపైనా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే! అర్హతలేకున్నా కాంట్రాక్టును కట్టబెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపైనా విచారణ జరపనున్నట్లు అధికారులు తెలిపారు.
cable bridge
morbi
bridge repairs
enquiry

More Telugu News