Telangana: ఒకేసారి 3 పిటిషన్లు వేసిన 'ఎమ్మెల్యేల కొనుగోలు' కేసు నిందితులు... విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

  • ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే యత్నంలో రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ అరెస్ట్
  • జైలులో తమకు ఏ క్లాస్ సదుపాయాలు కల్పించాలని నిందితుల పిటిషన్
  • బెయిలు మంజూరు చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు 
  • బెయిల్ పిటిషన్ పై విచారణను నవంబర్ 7కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
  • ఇతర పిటిషన్లపై విచారణను నవంబర్ 2కు వాయిదా వేసిన వైనం
టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై అరెస్టయిన రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లు సోమవారం ఏసీబీ కోర్టులో ఒకేసారి 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు వాటిపై విచారణలను వేర్వేరు తేదీలకు వాయిదా వేసింది. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై నిందితుల కస్టడీకి తొలుత అంగీకరించని ఏసీబీ కోర్టు... హైకోర్టు ఆదేశాలతో నిందితులను రిమాండ్ కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ ముగ్గురు నిందితులు సోమవారం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా రామచంద్ర భారతి, సింహయాజులుకు ఆరోగ్యం బాగా లేదని, వారికి వైద్య చికిత్సలు అందించేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని మరో పిటిషన్ ను దాఖలు చేశారు. ఇక తమ ముగ్గురికి జైలులో ఏ క్లాస్ సదుపాయాలు కల్పించే దిశగా ఉత్తర్వులు ఇవ్వాలని మూడో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను పరిశీలించిన ఏసీబీ కోర్టు... అనారోగ్యం, ఏ క్లాస్ సదుపాయాలపై విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది. అదే సమయంలో బెయిల్ పిటిషన్ పై విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది.
Telangana
TS High Court
ACB Court
Ramachandra Bharathi
Simhayajulu
Nanda Kumar

More Telugu News