Virat Kohli: కోహ్లీ రూం వీడియో లీక్... క్షమాపణలు చెప్పిన పెర్త్ హోటల్

Perth hotel apologizes Kohli
  • దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం పెర్త్ వచ్చిన టీమిండియా
  • హోటల్ క్రౌన్ టవర్స్ లో ఆటగాళ్లకు బస
  • కోహ్లీ రూంలో లేనప్పుడు వీడియో తీసిన వైనం
  • ఇది తగదంటూ మండిపడిన కోహ్లీ
టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. నిన్న దక్షిణాఫ్రికాతో మ్యాచ్ జరగ్గా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా పెర్త్ నగరంలోని క్రౌన్ టవర్స్ హోటల్ లో బస చేసింది. అయితే, కోహ్లీ రూంలో లేని సమయంలో, ఎవరో అతడి గదిలోకి వెళ్లి, అక్కడున్న వస్తువులను వీడియో తీయడం కలకలం రేపింది. 

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కోహ్లీ ధరించే దుస్తులు, కళ్లద్దాలు, టోపీలు, బూట్లు, ఇతర వస్తువులన్నింటినీ ఓ ప్రదర్శనగా ఈ వీడియోలో చూపించారు. దీనిపై కోహ్లీ భగ్గుమనడం తెలిసిందే. 

తన రూం వీడియో లీక్ కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతరుల ఏకాంతాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఓ వినోద వస్తువుగా చూడడం తగదని స్పష్టం చేశాడు. తమ అభిమాన క్రికెటర్లకు సంబంధించిన ఇలాంటి వీడియోలను ఫ్యాన్స్ ఇష్టపడతారన్న విషయాన్ని తాను అర్థం చేసుకోగలనని, కానీ ఈ విధంగా హోటల్ రూంలోకి చొరబడి వీడియో తీయడం చూస్తుంటే మతిపోయింది అని వ్యాఖ్యానించాడు. 

దీనిపై క్రౌన్ టవర్స్ హోటల్ మేనేజ్ మెంట్ స్పందించింది. కోహ్లీకి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనకు పాల్పడినవారిని గుర్తించామని తెలిపింది. వారిని విధుల నుంచి తొలగించామని, ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరుపుతున్నట్టు పేర్కొంది. అంతేకాదు, కోహ్లీ రూం ఫుటేజి ఒరిజినల్ వీడియోను కూడా సామాజిక మాధ్యమాల నుంచి తొలగించామని క్రౌన్ టవర్స్ వర్గాలు తెలిపాయి.
Virat Kohli
Room Video
Crown Towers
Perth
Australia
T20 World Cup

More Telugu News