Team India: 'టీ20 ప్రపంచ కప్' లో కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డు

Virat Kohli 28 Runs Away From Big T20 World Cup Record
  • రికార్డుకు ఇంకో 28రుగులు దూరంలో కోహ్లీ 
  • ఈ టోర్నీ చరిత్రలో హయ్యెస్ట్ స్కోరర్ గా నిలవనున్న మాజీ సారథి 
  • ఇప్పటిదాకా 989 పరుగులు చేసిన భారత స్టార్ బ్యాటర్
  • 1016 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న మహేల జయవర్ధనే 
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ లో వరుసగా రెండు మ్యాచ్ ల్లో అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్ తో తొలి మ్యాచ్ లో ఒంటి చేత్తో భారత్ ను గెలిపించిన విరాట్.. నెదర్లాండ్స్ పై కూడా సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్ లో అందరి దృష్టి అతనిపైనే ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ సెమీఫైనల్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంటుంది. అందుకు కోహ్లీ ఆట జట్టుకు కీలకం కానుంది. తను అదే జోరు కొనసాగిస్తే టీమిండియా విజయం సులువు అవుతుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీని ఓ అరుదైన ఘనత కూడా ఊరిస్తోంది. 

ఇప్పటిదాకా జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్ టోర్నీలలో కలిపి విరాట్ 989 పరుగులు చేశాడు. మరో 28 రన్స్ చేస్తే ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు బద్దలు కొడతాడు. ప్రస్తుతం శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే (1016 పరుగులు) పేరిట ఈ రికార్డు ఉంది.

దక్షిణాఫ్రికాపై 11 పరుగులు చేస్తే కోహ్లీ టీ20 ప్రపంచ కప్ లో వెయ్యి పరుగుల క్లబ్ లో చేరతాడు. 28 పరుగులు చేస్తే టోర్నీలో హయ్యెస్ట్ స్కోరర్ గా రికార్డు సృష్టిస్తాడు. ఈ మ్యాచ్ లోనే అతను ఈ రికార్డు అందుకుంటాడో లేదో చూడాలి. 

కాగా, టీ20 ప్రపంచ కప్ అనగానే కోహ్లీ విజృంభిస్తున్నాడు. గతంలో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. మొత్తంగా ఈ వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటిదాకా ఆడిన 23 మ్యాచ్‌ ల్లో అతను 12 అర్ధ సెంచరీలు సాధించి, 89.9 సగటుతో 989 పరుగులు చేశాడు.
Team India
T20 World Cup
Virat Kohli
record

More Telugu News