Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీ చేత విచారణ చేయించాలి: రేవంత్ రెడ్డి

revanth reddy viral allegationson on bjp and trs over moinabad farm house issue
  • కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేలా బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేశాయన్న రేవంత్ రెడ్డి
  • అందులో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా ఆడారని ఆరోపణ
  • సీబీఐ, ఏసీబీ దర్యాప్తులతో ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావని వ్యాఖ్య 
  • రాహుల్ యాత్రకు ప్రాధాన్యం దక్కకుండా కూడా ఈ కుట్రకు రచన అని ఆరోపణ 
టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో చోటుచేసుకున్న ఈ కేసుపై టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏసీబీ చేత విచారణ చేయించినా, లేదంటే బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లుగా కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ చెప్పు చేతల్లోని సీబీఐ చేత విచారణ చేయించినా అసలు వాస్తవాలు బయటకు రావని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసులో అసలు నిజాలు బయటకు రావాలంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీ చేత విచారణ చేయించడమొక్కటే మార్గమని ఆయన అన్నారు. ఈ మేరకు శనివారం మునుగోడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నట్లుగా తమను కొనుగోలు చేసేందుకు స్వామీజీలు రంగంలోకి దిగిన మాట వాస్తవమే అయితే... వారు తమ ఫోన్ సంభాషణల్లో చెప్పినట్లుగా ఢిల్లీలో ఉన్న నెంబర్ వన్, నెంబర్ టూ, ఆ తర్వాత బీఎల్ సంతోష్ లను నిందితులుగా చేర్చాలని, వారి తర్వాతే స్వామీజీలను నిందితులుగా చేర్చాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ ఈ వ్యవహారాన్ని టీఆర్ఎస్ రూపకల్పన చేసి ఉంటే... తొలి నిందితుడిగా సీఎం కేసీఆర్, రెండో నిందితుడిగా మంత్రి కేటీఆర్, ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు నిందితులుగా ఉండాల్సి ఉందన్నారు. అయినా ఈ కేసులో స్వామీజీ మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు... ఈ వ్యవహారంలో కీలకంగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ఎందుకు సీజ్ చేయలేదన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం బీజేపీ, టీఆర్ఎస్ రెండూ కలిసి ఆడిన నాటకంగా రేవంత్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు ఆ రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్నాయని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే రఘునందన్ రావు ఇంటిలో దొరికిన దబ్బు ఏమైందో ఇప్పటికీ తేలలేదన్నారు. అదే సమయంలో హుజూరాబాద్ ఎన్నికలో ఈటల రాజేందర్ పై కారాలు మిరియాలు నూరిన కేసీఆర్ ఆ తర్వాత చప్పుడు చేయకుండా మౌనంగా ఉండిపోయారన్నారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను బలహీనం చేసేందుకే ఆ రెండు పార్టీలు కలిసి కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు తెలంగాణలో ఎలాంటి ప్రాధాన్యం దక్కకుండా కూడా టీఆర్ఎస్, బీజేపీలు ఈ కుట్రకు పాల్పడ్డాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించే సమయంలోనే ఈ కుట్ర జరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఈ కుట్ర వెల్లడి కావడానికి 8 రోజుల ముందుగా తాను ఇలాంటి కుట్ర ఏదో జరగబోతోందని చెప్పానన్న రేవంత్ రెడ్డి... తాను చెప్పినట్లే ఈ కుట్ర జరిగిందన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు ప్రాధాన్యం దక్కకూడదన్న భావనతోనే ఆ రెండు పార్టీలు ఈ కుట్రకు తెర తీశాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Telangana
Congress
TPCC President
Revanth Reddy
Munugode
Dubbak
Huzurabad
BJP
TRS
KCR
KTR
Rahul Gandhi
Bharat Jodo Yatra
CBI
ACB

More Telugu News