Andhra Pradesh: అమరావతి రైతుల యాత్రపై ఏపీ హైకోర్టులో విచారణ పూర్తి... తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు

ap high court concludes hearing on amaravati farmers yatra
  • అమరావతి రైతుల యాత్రను నిలిపివేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం
  • అదనపు భద్రతతో కొనసాగించాలన్న అమరావతి రైతులు
  • అన్ని పిటిషన్లపై ఉమ్మడి విచారణ చేపట్టిన హైకోర్టు
  • పలు కొత్త అంశాలను ప్రస్తావించిన అమరావతి రైతులు
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్ తో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న పాద యాత్రను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ తో పాటు... యాత్రను కొనసాగించాలంటూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లను అన్నిటినీ కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది. అంతేకాకుండా ఈ పిటిషన్లపై విచారణ ముగిసినట్లు ప్రకటించిన కోర్టు...తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. 

విచారణ సందర్భంగా అమరావతి రైతులు గతంలో కోర్టుకు తెలిపిన విషయాలతో పాటు మరికొన్ని అంశాలను తాజాగా విచారణలో ప్రస్తావించారు. యాత్రకు మద్దతుగా ఆయా ప్రాంతాలకు చెందిన వారు వస్తూ ఉంటారని, వారిని కూడా యాత్రలో పాల్గొన్న వారిగా పోలీసులు పరిగణిస్తున్నారని ఫిర్యాదు చేశారు. యాత్రకు మద్దతు తెలుపుతున్న వారు యాత్రకు ముందూ వెనుకా నడిచేలా అనుమతి ఇవ్వాలని కోరారు. యాత్రలో కోర్టు చెప్పినట్లుగా 600 మంది మాత్రమే పాల్గొంటామని...ఎవరైనా తొలగితే వారి స్థానంలో కొత్త వారు వచ్చేలా అనుమతి ఇవ్వాలని కోరారు. ఇక యాత్ర ద్వారా తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని యాత్రను నిలుపుదల చేయాలని ప్రభుత్వం వాదించింది. ఈ వాదనలన్నీ విన్న కోర్టు... విచారణ ముగిసినట్లు ప్రకటించింది. తీర్పును తర్వాత వెల్లడించనున్నట్లు ప్రకటించింది.
Andhra Pradesh
Amaravati
AP High Court
Amaravati Farmers

More Telugu News