Bandi Sanjay: స్వాధీనం చేసుకున్న డబ్బు ఎక్కడుందో పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పాలి: బండి సంజయ్ డిమాండ్

Police commissioner Stephen Ravindra has to tell where is the caught money demands Bandi Sanjay
  • ఎమ్మెల్యేలను కొనాలని యత్నించారని ప్రచారం చేస్తున్నారన్న సంజయ్
  • తాను యాదాద్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపాటు
  • మునుగోడులో టీఆర్ఎస్ గెలవదనే దొంగదారిని వెతికారని ఎద్దేవా
తమ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ యత్నించిందంటూ టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి నరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేసి నిజాయతీని నిరూపించుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో యాదాద్రికి బయల్దేరుతున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు అనుమతి లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ... మునుగోడులో ఏదో చేయాలని అనుకున్నారని... అక్కడ కుదరకపోవడంతో హైదరాబాద్ లో ఏదో చేద్దామని ప్రయత్నించారని అన్నారు. ఇక్కడ కూడా పాచిక పారలేదని... ఇక ఢిల్లీ అంటారేమోనని ఎద్దేవా చేశారు. 

ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించారని... డబ్బు దొరికిందని ప్రచారం చేస్తున్నారని సంజయ్ అన్నారు. కొనుగోలుకు కుట్ర జరిగిందని చెపుతూ ఏసీబీ కోర్టుకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. డబ్బు దొరికింది నిజమైతే.. పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు ఎక్కడుందని అడిగారు. దీనికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను యాదాద్రి వెళ్లకుండా అడ్డుకోవాలని సీఎం కార్యాలయం నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయని మండిపడ్డారు. 

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలవదని... అందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ అన్నారు. అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయని తెలిపారు. అందుకే దొంగదారిని వెతికారని... అయితే అనుకున్నట్టు జరగకపోవడంతో డీలా పడ్డారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిన పని ప్రజలందరికీ తెలిసిపోయిందని... మునుగోడు పోటీ నుంచి టీఆర్ఎస్ తప్పుకోవడం మంచిదని అన్నారు.
Bandi Sanjay
BJP
TRS
Yadadri
MLAs
Horse Trading

More Telugu News