Anjali: ఓటీటీ రివ్యూ : 'ఝాన్సీ' ( వెబ్ సిరీస్ - డిస్నీ ప్లస్ హాట్ స్టార్)

  • అంజలి టైటిల్ రోల్ ను పోషించిన 'ఝాన్సీ'
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ 
  • అనూహ్యమైన మలుపులతో సాగే ఆసక్తికర కథ 
  • ఆశ్చర్యపరిచే నిర్మాణ విలువలు 
  • ప్రధానమైన బలంగా నిలిచిన స్క్రీన్ ప్లే 
  • అంజలి నటన హైలైట్
Jhansi OTT Review

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో అంజలికి మంచి క్రేజ్ ఉంది. ఒక వైపున సినిమాలు చేస్తూనే మరో వైపున వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ 'ఝాన్సీ'. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ 'డిస్నీ హాట్ స్టార్'లో ఈ రోజు (27/10/22) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1లో భాగంగా 6 ఎపిసోడ్స్ ను వదిలారు. కృష్ణ కులశేఖరన్ .. మధుబాల నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి, 'తిరు' దర్శకత్వం వహించాడు. గణేశ్ కార్తీక్ రచయితగా వ్యవహరించిన ఈ వెబ్ సిరీస్ ఏ స్థాయిలో ఆకట్టుకుందనేది చూద్దాం. 

ఇది ఒక యువతి చుట్టూ తిరిగే కథ .. తానెవరో .. తన పేరేమిటో తెలియని యువతి కథ. అనుకోకుండా ఆమెకి కొన్ని సంఘటనలు కళ్లముందు కదలాడుతుంటాయి. ఆ దృశ్యాలలో తనకి తరచూ కనిపించే మనుషుల ముఖ చిత్రాలను గుర్తుకోసం ఆమె రేఖామాత్రంగా గీసుకుంటుంది. అయితే వాళ్లు ఎవరు? వాళ్లతో తనకి గల సంబంధం ఏమిటి? తాను నేర్చుకోకుండానే కొని విద్యలలో తాను నైపుణ్యం కలిగి ఉండటానికి కారణం ఏమిటి? అనేది ఆమెకి తెలియదు. ఆ విషయాలను తెలుసుకోవడానికి ఆ యువతి చేసే ప్రయాణమే 'ఝాన్సీ'. 

ఈ కథ కేరళలో మొదలవుతుంది .. జలపాతంలో పడిపోయి ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఒక యువతి (అంజలి)ని అక్కడి గిరిజనులు కాపాడతారు. ఆమె గాయాలకు చికిత్స చేసి కోలుకునేలా చేస్తారు. తన ఒక్కగానొక్క కూతురైన 'మేహా'తోను .. తన అంకుల్ తో కలిసి సంకీత్ (ఆదర్శ్ బాలకృష్ణ) ఆ ప్రాంతానికి వెళతాడు. ప్రమాదం బారిన పడబోయిన 'మేహా'ను కాపాడిన యువతిని గురించి అక్కడివారిని అతను అడుగుతాడు. ఆ యువతి గురించి చెప్పిన అక్కడివారు, ఆమెకి గతం గుర్తుకులేదని అంటారు. దాంతో ఆమెను తీసుకుని అతను హైదరాబాద్ వస్తాడు. తన అంకుల్ సాయంతో ఆమెకి గతాన్ని గుర్తుకు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ యువతికి అతని కూతురు మేహా పెట్టిన పేరే 'ఝాన్సీ'. 

సంకీత్ భార్య సాక్షి ఓ పోలీస్ ఆఫీసర్. సాక్షి ధోరణి నచ్చకపోవడం వలన, ఆమెకి దూరమవుతాడు. అలా ఒంటరిగా ఉన్న అతను ఝాన్సీని వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అతనితో కలిసే ఉంటున్న ఝాన్సీ .. తన పేరుతో ఒక 'బొటిక్' రన్ చేస్తూ ఉంటుంది. ఒకసారి తెలిసినవారి ఇంట్లో పెళ్లికి వెళ్లిన ఝాన్సీ, అక్కడి సెల్లార్ లో ఒంటరిగా ఉన్న ఒక ఆడపిల్లపై ఒక పెద్ద మనిషి అఘాయిత్యానికి పాల్పడుతుంటే అతణ్ణి అడ్డుకుంటుంది. ఆ పెనుగులాటలో అతను చనిపోతాడు. ఆ హత్య తాలూకు భయం ఆమెను వెంటాడుతూ ఉంటుంది. 

ఇక ఒక రోజున ఆమె కారులో వెళుతూ రాజకీయనాయకుడైన బల్లెం వీరబాబును చూస్తుంది. తరచూ తన కళ్లలో మెదిలే  రూపాల్లో అతను ఒకడు. ఆ వ్యక్తి కన్నుకి గాయమైన దృశ్యమే ఆమెకి బాగా గుర్తు.  అందువలన ఒక ప్లాన్ ప్రకారం అతణ్ణి తన బొటిక్ లో బంధిస్తుంది. అతని కన్నుకు ఎలా గాయమైందని అడుగుతుంది. అందుకు గల కారణాన్ని అతను చెప్పడం మొదలుపెట్టడంతో, 15 ఏళ్ల క్రితం నాటి ఝాన్సీ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. తన గురించి కొంతవరకూ తెలుసుకున్న 'ఝాన్సీ' .. మిగతా సమాచారం కోసం రిప్పూ కుమార్ ఊరుకు వెళుతుంది. అతని భార్య సావిత్రి ద్వారా జరిగిందంతా తెలుసుకుంటుంది. 

అయితే ఆ ఊరు దాటిన తరువాత ఏం జరిగింది?  ఏ సంఘటన తరువాత తాను గతం మరిచిపోయింది తెలుసుకోవాలంటే, అందుకు మరికొంతమంది ప్రమాదకరమైన మనుషులను కలుసుకోవాలనే విషయం ఆమెకి అర్థమవుతుంది. ఆ జాబితాలో కేలాబ్ .. తయాబ్ .. అధికారంలో ఉన్న రామజయం ఉంటారు. మహిత ఎవరు? ఆమె గతం ఎలాంటిది? ఆమె గతంతో ముడిపడిన వ్యక్తులు ఎవరు? వాళ్లతో మహితకి ఉన్న సంబంధం ఏమిటి? తన సమస్య నుంచి తాను బయటపడటానికి ప్రయత్నిస్తూనే, తన చుట్టూ ఉన్నవారు ఎదుర్కుంటున్న సమస్యలకి ఎలాంటి ముగింపు పలుకుతూ వెళ్లిందనేది కథ.

 ఈ వెబ్ సిరీస్ లో సీజన్ 1లో భాగంగా 6 ఎపిసోడ్స్ ను వదిలారు. ప్రతి ఎపిసోడ్ కూడా మొదటి నుంచి చివరివరకూ ఆసక్తికరంగా కొనసాగుతుంది. ప్రతి ఎపిసోడ్ బ్యాంగ్ ఆ తరువాత ఎపిసోడ్ లో ఏం జరగనుందా అనే ఉత్కంఠను రేకెత్తిస్తుంది. కథాకథనాల పరంగా ఈ సిరీస్ ఆకట్టుకుంటుంది. ఎక్కడికక్కడ కొత్త సన్నివేశాలు .. కొత్త కొత్త పాత్రలు ఎంటరవుతూ కథను పరిగెత్తిస్తూ ఉంటాయి. ఈ కథకి స్క్రీన్ ప్లే ప్రధానమైన బలమని చెప్పచ్చు. సినిమాను చూస్తున్నామా? సిరీస్ చూస్తున్నామా? అనే ఫీలింగ్ రావడం ఖాయం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చిత్రీకరించారు. 

కథాకథనాల తరువాత ..  శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఆర్వీ కెమెరా పనితనం ప్రత్యేకమైన ఆకర్షణగా అనిపిస్తాయి. ఆంటోని ఎడిటింగ్ కూడా బాగుంది. గణేశ్ కార్తీక్ అల్లుకున్న కథ బాగుంది. మహిత పాత్రను అనూహ్యమైన మలుపులతో అతను ముందుకు తీసుకుని వెళ్లిన విధానం బాగుంది. తన గతానికి సంబంధించిన అన్వేషణలోని సవాళ్లను ఆమె ఎదుర్కొంటూ వెళుతుంటే, ఝాన్సీ గా ఆమె చుట్టూ మరికొన్ని చిక్కుముడులు పడుతూ ఉండటం ఈ కథలోని ఆసక్తికర అంశం. 

మహితగా ఆమె తన గతానికి సంబంధించిన విషయాలను కొంతవరకూ మాత్రమే తెలుసుకుంటుంది. మిగతా విషయాలను తెలుసుకునే క్రమంలో విలన్ గ్యాంగ్ చేతికి చిక్కుతుంది. ఆ తరువాత ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయడానికి అవసరమైనంత ఉత్కంఠ దగ్గర 6వ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక అటు మహితగా .. ఇటు ఝాన్సీ గా అంజలి గొప్పగా నటించింది. గతానికి ... వర్తమానానికి మధ్య నలిగిపోయే ఈ పాత్రలో ఆమె నటన హైలైట్. యాక్షన్ సీన్స్ లోను ఆమె శభాష్ అనిపించుకునేలా చేసింది. ఈ 6 ఎపిసోడ్స్ వరకూ చూసుకుంటే, అంజలి కెరియర్లోనే చెప్పుకోదగిన వెబ్ సిరీస్ గా ఇది నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

More Telugu News