Fire Haircut: నిప్పుతో హెయిర్ కట్... చివరికి ఏమైందో చూడండి!

Fire Hair Cut failed as youth hospitalized in Gujarat
  • గుజరాత్ లో ఘటన
  • వినూత్న హెయిర్ కట్ కోసం సెలూన్ కు వెళ్లిన కుర్రాడు
  • జుట్టుకు మంటల సెగ తగిలేలా చేసిన క్షురకుడు
  • ఒక్కసారిగా భగ్గుమన్న మంటలు
  • కుర్రాడికి తీవ్రగాయాలు
ఫ్యాషన్ రంగంలో గ్లోబలైజేషన్ ప్రభావం అంతాఇంతా కాదు. ప్రపంచంలో ఏ మూల కొత్త ఫ్యాషన్ వెలుగు చూసినా, వెంటనే పాకిపోతోంది. సోషల్ మీడియా చలవతో ఈ ధోరణులు మరింత వేగం పుంజుకున్నాయి. ఎక్కడో లాటిన్ అమెరికా దేశాల్లో ఓ సాకర్ స్టార్ సరికొత్త హెయిర్ స్టయిల్ చేయించుకుంటే, అతడ్ని టీవీల్లో చూసిన ఆసియన్లు, ఆఫ్రికన్లు అదే హెయిర్ స్టయిల్ అనుసరిస్తుంటారు. కొత్తదనం కోసం పాకులాడే యువత దేనికైనా సై అంటుంది. 

ఇక అసలు విషయానికొస్తే... ఇటీవల కాలంలో ఫైర్ హెయిర్ కట్ పాప్యులర్ అయింది. హెయిర్ స్టయిల్ ను తీర్చిదిద్దేందుకు జుట్టుకు మంటల సెగ తగిలేలా చేస్తారు. దీన్నే ఫైర్ హెయిర్ కట్ గా పిలుస్తారు. అయితే, ఇలా నిప్పుతో హెయిర్ కట్ చేయించుకునే ప్రయత్నంలో గుజరాత్ కు చెందిన ఓ టీనేజి కుర్రాడు ఆసుపత్రి పాలయ్యాడు. 

గుజరాత్ లోని వల్సాద్ జిల్లా వాపి పట్టణంలో 18 ఏళ్ల కుర్రాడు మోడ్రన్ హెయిర్ కట్ చేయించుకునేందుకు సెలూన్ కు వెళ్లాడు. అక్కడ క్షురకుడితో తనకు ఫైర్ హెయిర్ కట్ చేయాలని కోరాడు. దాంతో, ఆ క్షురకుడు కుర్రాడి తలపై కొద్దిభాగంలో ఓ రసాయనం పూసి మంటల సెగ తగిలేలా చేశాడు. 

కానీ తలపై ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాటిని నియంత్రించడం కష్టమైంది. ఈ క్రమంలో ఆ కుర్రాడికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, మెరుగైన చికిత్స కోసం వల్సాద్ లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడిని సూరత్ లోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Fire Haircut
Youth
Flames
Hospital
Gujarat

More Telugu News