Telangana: భారీ 'ఆపరేషన్ ఆకర్ష్'ను అడ్డుకున్న సైబరాబాద్ పోలీసులు...వివరాలు ఇవిగో

cyberabad police busted operation akarsh gang in hyderabad premises and siezed huge hard cash
  • నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వల వేసిన ముఠా
  • ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఇస్తామని ముఠా ఆపర్
  • ఓ ఫామ్ హౌజ్ వేదికగా సంప్రదింపులు
  • ప్రలోభాలపై పోలీసులకు సమాచారం ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • పక్కా సమాచారంతో దాడి చేసిన సైబరాబాద్ పోలీసులు
  • ఆపరేషన్ లో స్వయంగా పాల్గొన్న సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
తెలంగాణలో హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు బుధవారం ఓ భారీ ఆపరేషన్ ఆకర్ష్ ను అడ్డుకున్నారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు యత్నించిన ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులకు చిక్కిన వారిలో ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి అలియస్ సతీశ్ శర్మ, తిరుపతికి చెందిన సింహయాజులు, హైదరాబాద్ లో దెక్కన్ ప్రైడ్ పేరిట హోటల్ నడుపుతున్న అంబర్ పేటకు చెందిన నందకుమార్ లు ఉన్నారు. 

టీఆర్ఎస్ కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలతో మొయినాబాద్ లోని ఫామ్ హౌజ్ వేదికగా నిందితులు ఇప్పటికే చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఎమ్మెల్యేలే స్వయంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు సమాచారం ఇచ్చారు. దీంతో తన బలగాలతో కలిసి స్టీఫెన్ రవీంద్ర స్వయంగా రంగంలోకి దిగి... ముఠాలోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఫామ్ హౌజ్ పై దాడి సందర్బంగా ముగ్గురు నిందితులు పట్టుబడగా... వారి వద్ద నుంచి బ్యాగుల్లో కుక్కిన కరెన్సీ కట్లలను పెద్ద మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాము చెప్పినట్లుగా పార్టీ ఫిరాయిస్తే... ఒక్కొక్కరికి రూ.100 కోట్ల చొప్పున డబ్బు ఇస్తామని, డబ్బుతో పాటు కాంట్రాక్టులు, పదవులు కూడా ఇస్తామని నిందితులు ప్రలోభపెట్టినట్లు సమాచారం. ఈ బేరసారాలు ఓ ఫామ్ హౌజ్ లో జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రలోభాలు బీజేపీ నుంచే వచ్చాయని వార్తలు వచ్చినా... దానిపై స్టీఫెన్ రవీంద్ర ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
Telangana
Cyclone Nisarga
TS Police
Hyderabad
Operation Akarsh
TRS
Moinabad

More Telugu News