Congress: కాంగ్రెస్ లో అధ్యక్ష మార్పిడి రేపే... సోనియా నుంచి బాధ్యతలు స్వీకరించనున్న ఖర్గే

mallikarjun kharge takes charge as congress party new president tomorrow
  • కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ఖర్గే
  • పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ
  • సోనియాకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించనున్న ఏఐసీసీ
  • ఆ  వెంటనే పార్టీ నూతన అధ్యక్షుడి హోదాలో ప్రసంగించనున్న ఖర్గే
  • ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం
కాంగ్రెస్ పార్టీలో రేపు (బుధవారం) ఓ కీలక పరిణామం చోటుచేసుకోనుంది.చాలా ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన నేత ఆ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. ఇటీవలే ముగిసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కర్ణాటకకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే విజయం సాధించిన సంగతి తెలిసిందే. రేపు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో ప్రస్తుతం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఖర్గే స్వీకరిస్తారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ సర్టిఫికెట్ ను అందజేయనున్నారు. అంతకుముందే... పార్టీకి ఇన్నేళ్ల పాటు సేవలందించిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ ఏఐసీసీ ఓ తీర్మానాన్ని ఆమోదిస్తుంది. తదనంతరం పార్టీ అధ్యక్షుడి హోదాలో ఖర్గే ఏఐసీసీ సభ్యులు, ఇతర పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఏఐసీసీ నేతలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు ఆహ్వానాలు అందాయి.
Congress
Sonia Gandhi
AICC
Mallikarjun Kharge

More Telugu News