Dirty Bomb: ఉక్రెయిన్ 'డర్టీ బాంబ్' వ్యవహారాన్ని భద్రతామండలి దృష్టికి తీసుకెళతామన్న రష్యా

Russia says they will take Ukraine Dirty Bomb issue to UNSC
  • రేడియో ధార్మిక శక్తిని విడుదల చేసే డర్టీ బాంబ్
  • ఈ బాంబ్ తో తీవ్ర ప్రభావం
  • ఇది అణు ఉగ్రవాదంలో భాగమేనన్న రష్యా
  • ఉక్రెయిన్ పై ఐరాసకు లేఖ
  • నేడు భద్రతామండలిలో చర్చ
రేడియో ధార్మిక ప్రభావం చూపే ప్రమాదకర 'డర్టీ బాంబ్' ను ఉక్రెయిన్ తయారుచేస్తోందని, తమపై బెదిరింపులకు పాల్పడుతోందని రష్యా ఆరోపిస్తుండడం తెలిసిందే. తమ అధీనంలో ఉన్న ఖేర్సన్ పట్టణంలో రేడియో ధార్మిక పదార్థాలున్న డర్టీ బాంబ్ ను ప్రయోగించేందుకు ఉక్రెయిన్ కుట్ర పన్నుతోందని రష్యా ఆరోపించింది. 

అయితే, రష్యానే 'డర్టీ బాంబ్' తయారుచేస్తూ తమపై ఆరోపణలు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రత్యారోపణలు చేశారు. రష్యా ఏదైనా ప్రమాదకర చర్యలకు పాల్పడే ముందు ఎదుటివాళ్లపై ఇలాంటి ఆరోపణలు చేస్తుంటుందని అన్నారు. 

అయితే, ఇప్పుడీ వ్యవహారం ఐక్యరాజ్యసమితికి చేరనుంది. ఉక్రెయిన్ 'డర్టీ బాంబ్' హెచ్చరికలను తాము భద్రతామండలి దృష్టికి తీసుకెళతామని రష్యా వెల్లడించింది. ఇప్పటికే రష్యా తన ఆరోపణలతో కూడిన లేఖను ఐక్యరాజ్యసమితికి సోమవారం పంపింది. 

ఉక్రెయిన్ నాయకత్వం నుంచి వస్తున్న డర్టీ బాంబ్ బెదిరింపులు అణు ఉగ్రవాదంలో భాగమేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రాస్ ను ఉద్దేశించి రష్యా రాయబారి వాసిలీ నెంబెజియా తన లేఖలో పేర్కొన్నారు. నేడు భద్రతామండలి సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామని రష్యా దౌత్యవేత్తలు వెల్లడించారు.
Dirty Bomb
Russia
Ukraine
UNSC

More Telugu News