teen girl: కాపాడాలని ప్రాధేయపడుతున్నా.. కనికరం లేకుండా మొబైల్ లో షూటింగ్

  • ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ లో దారుణం
  • ప్రభుత్వ అతిథి గృహం వద్ద గాయాలతో పడి ఉన్న బాలిక
  • కాపాడాలని కోరినా ఒక్కరూ ముందుకు రాని స్థితి
teen girl lay bleeding asking for help as men stood around filming her

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని? అని ఓ కవి సినిమా పాటలో ఆవేశంగా ప్రశ్నిస్తాడు. మానవ సమాజంలో భాగంగా ఉంటూ తోటి వారి పట్ల కనీసం మానవత్వాన్ని మరిచి పోవడం బాధాకరం. ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ లో హృదయాన్ని కదిలించే ఘటన ఒకటి చోటు చేసుకుంది. 

ఓ బాలిక గాయాలతో తిర్వా ప్రాంతంలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ వద్ద పడిపోయి ఉంది. రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. యువకులు తమ మొబైల్ ఫోన్లతో ఆమెను వీడియో తీస్తున్నారు. గాయాలతో బాధపడుతున్న ఆమె తనను కాపాడాలంటూ భారంగా చేతులు పైకి లేపుతూ చుట్టూ చేరిన వారిని ప్రాధేయపడింది. 

కానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయలేదు. పోలీసులకు కాల్ చేయండంటూ అక్కడున్న వారు ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి ఫోన్లతో వీడియో షూట్ లో మునిగిపోయారు. దీంతో కొంత సమయం తర్వాత అక్కడికి పోలీసులు చేరుకున్నారు.

ఆమెను అక్కడి నుంచి ఆటోలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. పోలీసుల కథనం ప్రకారం.. సదరు బాలిక ఆదివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ప్రభుత్వ అతిథి గృహం సీసీటీవీ కెమెరా రికార్డ్ లను పరిశీలించా, ఓ యువకుడితో మాట్లాడుతూ కనిపించింది. ఆమెపై అత్యాచారం లేక లైంగిక వేధింపు జరిగిందా? లేదంటే అసలు ఏమైందన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.

More Telugu News