Russia: అర్ధరాత్రి 36 రాకెట్లతో ఉక్రెయిన్​ పై విరుచుకుపడ్డ రష్యా

  • ఇందన మౌలిక సదుపాయలే లక్ష్యంగా విరుచుకుపడ్డ రష్యా బలగాలు
  • దేశంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
  • ఉగ్రవాదుల మాదిరిగా దొంగ దెబ్బ తీశారంటూ రష్యాపై  తీవ్ర ఆగ్రహం
Russia launched 36 rockets in massive attack overnight on Ukraine says Zelenskyy

రాత్రి సమయంలో తమ దేశంపై రష్యా భారీ దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. శనివారం రాత్రి రష్యా దళాలు తమ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయడంతో దేశవ్యాప్తంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడిందన్నారు. ఇలాంటి మెరుపు దాడులతో రష్యా తమ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉందని చెప్పారు. రాత్రి సమయంలో శత్రు దేశం 36 రాకెట్లను సంధించి భారీ దాడిని ప్రారంభించిందన్నారు. వీటిలో చాలా రాకెట్లను తమ దళాలు కాల్చివేశాయని చెప్పారు.

మిగతా రాకెట్లు మాత్రం తమ దేశానికి చెందిన ముఖ్యమైన స్థావరాలపై పేలాయన్నారు. ఇది చాలా నీచమైన దాడి అని జెలెన్‌స్కీ విమర్శించారు. రష్యా  ఉగ్రవాదుల మాదిరిగా విలక్షణమైన వ్యూహాలతో తమను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లోని లక్షలాది కుటుంబాలకు విద్యుత్తు సరఫరా లేకుండా పోయిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఖెల్మెల్నిట్ స్కి , మైకోలైవ్, రివ్నే, కిరోవ్స్‌లోస్ ప్రాంతాల్లో అంధకారం నెలకొందని తెలిపారు.

More Telugu News