Hanumakonda: నడిరోడ్డుపై చితక్కొట్టేసుకున్న బీటెక్ విద్యార్థులు

B Tech Students Attacked Each Other in Hanamkonda dist
  • హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో ఘటన
  • సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు
  • రోడ్డుపైనే కలబడడంతో స్తంభించిన ట్రాఫిక్
వారందరూ బీటెక్ విద్యార్థులు. గత కొంతకాలంగా సీనియర్లు, జూనియర్ల మధ్య గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోడ్డుపై రెండు వర్గాలు తారసపడ్డాయి. అంతే, తాము భావి ఇంజినీర్లమన్న స్పృహ కోల్పోయి అందరూ చూస్తుండగానే చితక్కొట్టేసుకున్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హసన్‌పర్తి మండలం అనంతసాగర్ శివారులోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న సీనియర్లు, జూనియర్లకు మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నాయి. ఈ క్రమంలో ఘర్షణలు జరుగుతున్నాయి. 

నిన్న ఎల్కతుర్తి మండలం ఒగ్లాపూర్ జాతీయ రహదారిపై బావుపేట క్రాస్‌రోడ్డులో సీనియర్లు, జూనియర్లు ఒకరికొకరు ఎదురయ్యారు. అంతే, ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఒకరినొకరు దూషించుకుంటూ పైపైకి వెళ్లారు. ఈ క్రమంలో ఘర్షణ పెరిగి పెద్దదైంది. ఇరు వర్గాలు దాడులకు దిగాయి. రోడ్డుపైనే కలబడుకున్న వారు కొట్టుకుంటూ కిందనున్న పొలాల్లోకి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు స్పృహ కోల్పోయారు. 

అదే సమయంలోనే యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అటుగా వెళ్తూ గొడవ పడుతున్న విద్యార్ధులను చూశారు. వెంటనే వారి వద్దకెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినిపించుకోని విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రోడ్డుపైనే రచ్చ జరుగుతుండడంతో కరీంనగర్-హనుమకొండ రోడ్డుపై దాదాపు అరగంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న హసన్‌పర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
Hanumakonda
Hasanparthy
B-Tech
B-Tech Students
Warangal

More Telugu News