Khudiram Bose: 53వ ఐఎఫ్ఎఫ్ఐ వేడుకలకు ఎంపికైన 'కుదీరాం బోస్'

  • స్వాతంత్ర్య సమరయోధుల్లో పిన్న వయస్కుడు కుదీరాం బోస్
  • ఆయన జీవిత కథతో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన 'కుదీరాం బోస్'
  • లీడ్ రోల్ పోషించిన రాకేశ్ జాగర్లమూడి
Kudiram Bose selected for IFFI

స్వాతంత్ర్య సమరయోధుడు కుదీరాం బోస్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'కుదీరాం బోస్' 53వ ఐఎఫ్ఎఫ్ఐ చలనచిత్రోత్సవానికి ఎంపికయింది. గోవాలో జరిగే ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో 'ఆర్ఆర్ఆర్', 'అఖండ', 'సినిమా బండి' వంటి తెలుగు చిత్రాలతో పాటు 'కుదీరాం బోస్' సినిమాను కూడా ప్రదర్శిస్తారు. ఈ బయోపిక్ కు విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించగా... గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. రాకేశ్ జాగర్లమూడి లీడ్ రోల్ ను పోషించారు. మణిశర్మ సంగీతాన్ని అందించారు. 

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఖుదీరామ్ బోస్. బోస్ 1889లో జన్మించాడు. అయితే ప్రసిద్ధ ముజఫర్‌పూర్ కుట్ర కేసులో బ్రిటీష్ ప్రభుత్వం అతడిని దోషిగా నిర్ధారించింది. 1908లో మరణశిక్ష విధించారు. ఈ కేసు విషయంలో జరిగిన కుట్ర విషయం... చరిత్రను అనుసరించే విద్యార్థులకు బాగా తెలుసు. 

కుదీరాం బోస్ పై వచ్చిన పాన్-ఇండియా బయోపిక్ అత్యంత ఆశాజానకమైన  చిత్రాలలో ఒకటి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 53వ ఎడిషన్‌లో ప్రదర్శించడానికి తెలుగు చిత్రం 'ఖుదీరామ్ బోస్' ఎంపికైనట్లు నూతన నిర్మాత రజిత విజయ్ జాగర్లమూడి మరియు దర్శకులు విజయ్ జాగర్లమూడి మరియు డివిఎస్ రాజు సంతోషంగా ప్రకటించారు. 

కుదీరాం బోస్... ఆసియాలో జరిగే అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్స్ లో ఒకటిగా పేరొందిన ఐఎఫ్ఎఫ్ఐ ఫీచర్స్ ఫిలిమ్స్ విభాగంలో ప్రదర్శించేందుకు ఎంపికైంది. ఎంపిక చేసిన చిత్రాలు 2022 నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరిగే 53వ IFFIలో ప్రదర్శిస్తారు.
 

More Telugu News