Amaravati: డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమరావతి రైతుల యాత్రను అడ్డుకున్న పోలీసులు.. వాగ్వివాదం

ap police stops amaravati farmers yatra in konaseema district
  • కోనసీమ జిల్లాలో కొనసాగుతున్న యాత్ర
  • పసలపూడి వద్ద యాత్రను అడ్డుకున్న పోలీసులు
  • ఐడీ కార్లులు చూపించి ముందుకు కదలాలని ఆదేశం
  • పోలీసులు, రైతుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం
  • ఐకాస నేతలను ఈడ్చి పడేసిన పోలీసులు
  • తలకు గాయంతో సొమ్మసిల్లిపడిపోయిన మహిళా రైతు
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న పాదయాత్రను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పసలపూడిలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పసలపూడి గ్రామానికి యాత్ర చేరుకోగానే... రైతులను పోలీసులు నిలిపివేశారు. ఐడీ కార్డులు చూపిస్తే గానీ యాత్రకు అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నేతలు, పోలీసుల మధ్య చాలా సేపే వాగ్వాదం చోటుచేసుకుంది. 

హైకోర్టు అనుమతులతోనే యాత్ర చేస్తున్నామని రైతులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ సందర్భంగా ముందుకు కదిలేందుకు రైతులు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే భారీ సంఖ్యలో పోలీసు బలగాలను అక్కడ మోహరించిన ఉన్నతాధికారులు... రైతులను నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. ఒకానొక సందర్భంలో రైతులపై పోలీసులు చేయి చేసుకున్నట్లుగా పలు టీవీ ఛానెళ్లు విజువల్స్ చూపించాయి. తమతో వాదించేందుకు యత్నించిన ఐకాస నేతలను పోలీసులు ఈడ్చి పడేశారు. ఈ క్రమంలో ఓ మహిళా రైతు తలకు గాయం కాగా... ఆమె అక్కడే సొమ్మసిల్లిపడిపోయారు. మొత్తంగా అక్కడ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయాయి. చాలాసేపటి తర్వాత యాత్ర ముందుకు కదిలింది. 
Amaravati
Andhra Pradesh
AP Police
Dr BR Ambedkar Konaseema District

More Telugu News